గత 3 దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న .. నిత్యం చాలా ఆరోగ్యంగా పనిచేస్తూ ఉంటారు. 75 ఏళ్ల వయసులోనూ యువకులతో పోటీ పడి మరీ.. అటు రాజకీయాలు, ఇటు పరిపాలనను సమంగా చూసుకుంటున్నారు. ఇక ప్రధానమంత్రి పదవి చేపట్టి 11 ఏళ్లు పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ.. ఈ దశాబ్ద కాలంలో అనేక విదేశీ పర్యటనలు చేశారు. అంతేకాకుండా దేశంలోనూ అనేక పర్యటనలు, బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించారు. ప్రధాని మోదీ రోజుకు 18 గంటల పాటు పనిచేస్తారని.. బీజేపీ వర్గాలు, ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఇలా నిత్యం పనిచేయాలంటే.. ఆరోగ్యం సహకరించాలి. ఇందుకోసం సరైన ఆహారపు అలవాట్లు ఉండాలి. ఈ నేపథ్యంలోనే అసలు ప్రధాని మోదీ ఎలాంటి ఆహారం తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.75 ఏళ్ల వయసులోనూ ప్రధాని మోదీ చురుకుగా, శక్తివంతంగా ఉండటానికి కారణం ఆయన అనుసరించే ప్రత్యేకమైన ఆహార నియమాలేనని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇటీవల లెక్స్ ఫ్రిడ్‌మన్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన ఆహార రహస్యాలను స్వయంగా నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఈ సందర్భంగా ఉపవాసమే తన శక్తికి మూలమని పేర్కొన్నారు. ఉపవాసాన్ని తాను ఒక ఆధ్యాత్మిక సాధనగా భావిస్తానని ప్రధాని మోదీ చెప్పారు. ఉపవాసం ఎప్పుడూ తనను బలహీనపరచదని.. పైగా మరింత శక్తివంతంగా మారుస్తుందని తెలిపారు. ఉపవాసం చేయడం వల్ల ఇంద్రియాలు మరింత చురుకుగా మారతాయని.. ఆలోచనా శక్తి పెరుగుతుందని వెల్లడించారు. వీటితోపాటు నిత్యం యోగా, ధ్యానం కూడా ప్రధాని మోదీ హెల్త్ సీక్రెట్‌లో భాగం.మరోవైపు.. ప్రతీ సంవత్సరం నవరాత్రి సమయంలో 9 రోజుల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా కేవలం వేడి నీళ్లు మాత్రమే తాగుతానని నరేంద్ర మోదీ తెలిపారు. ఇక చతుర్మాస్ (జూన్ నుంచి నవంబర్) వరకు ఉండే ఈ 4 నెలల కాలంలో రోజులో ఒకసారి మాత్రమే భోజనం చేస్తానని చెప్పారు. ఇది భారతీయ సంప్రదాయంలో ఒక భాగమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అంతేకాకుండా ఆహారంలో కూడా ఆయుర్వేదం, పోషకాలతో కూడిన సంప్రదాయ వంటకాలకు మోదీ ప్రాధాన్యత ఇస్తారు.అయితే తాను తరచుగా మునగాకు పరోటా తింటానని నరేంద్ర మోదీ ఒకసారి తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో వెల్లడించారు. మునగాకులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మరింత పెంచుతాయి. ఇక ప్రధాని మోదీ ఆయుర్వేద పోషకాలు ఉండే వేప పూలు, వేప ఆకులు, మిస్రీ వంటి వాటిని క్రమం తప్పకుండా తీసుకుంటారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. నరేంద్ర మోదీకి ఖిచిడి అంటే చాలా ఇష్టం. అయితే ఇది సులభంగా జీర్ణమయ్యే, పోషక విలువలు ఉన్న సంపూర్ణ ఆహారం. ఇక స్నాక్‌గా గుజరాతీ వంటకమైన ధోక్లాను చాలా కొద్ది మొత్తంలో తీసుకుంటారు. ఈ ధోక్లాను తక్కువ నూనెతో తయారు చేస్తారు. ఇక ప్రాసెస్ చేసిన ఫుడ్, ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారాలను నరేంద్ర మోదీ చాలా తక్కువగా తింటారని తెలుస్తోంది. ఆహారం విషయంలో ప్రధాని మోదీ పాటించే ఈ కఠిన క్రమశిక్షణ కారణంగానే 75 ఏళ్ల వయసులోనూ ఆయన చురుగ్గా ఉంచుతోందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.