మీ చపాతీకీ ఓ న్యాయం.. మా ఇడ్లీకో న్యాయమా.. మీ రోటీకి ఓ ధర్మం.. మా దోసెకు మరో ధర్మమా.. మరి మా వడ మీకేం అన్యాయం చేసింది.. అంటున్నారు ఓ ఎమ్మెల్యే. అనడమే కాదు ఏకంగా నిలదీస్తానంటున్నారు. ఏపీ అసెంబ్లీ వేదికగా ఇదే ప్రశ్నను బలంగా లేవనెత్తారు జనసేన ఎమ్మెల్యే . కేంద్ర ప్రభుత్వం సంగతి తెలిసిందే. కొన్ని వస్తువుల మీద జీఎస్టీని పూర్తిగా తీసివేయగా.. మరికొన్నింటి శ్లాబులను మార్చింది.కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లు సవరించినా ఓ విషయంలో మాత్రం దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని కొణతాల రామకృష్ణ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని జీఎస్టీ మండలి సమావేశంలో ప్రస్తావించాలని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తీసుకెళ్లారు.కొణతాల రామకృష్ణ చెప్తున్న ప్రకారం.. ఉత్తరాది ఆహారమైన చపాతీ, రోటీ, పనీర్‌లపై జీఎస్టీని సున్నాగా చేశారు. అదే దక్షిణాది ఆహారమైన ఇడ్లీ, వడ, దోసెల మీద మాత్రం ఐదు శాతం జీఎస్టీ విధిస్తోంది కేంద్రం. ఇది దక్షిణాదిపై పూర్తిగా వివక్షతో ఉన్నట్లుగా ఉందని కొణతాల రామకృష్ణ విమర్శ. ఈ నేపథ్యంలో జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని కొణతాల రామకృష్ణ.. ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ను కోరారు. ఈ సందర్భంగా మంచి సలహా ఇచ్చారంటూ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కొణతాల రామకృష్ణను అభినందించారు. మరోవైపు ఈ అంశం మీద హోటల్ యాజమాన్యాలు సైతం గందరగోళంలో ఉన్నాయి. రోటీ, పరాటాల మీద జీఎస్టీ మినహాయింపు ఇచ్చినట్లు ప్రకటించారని.. కానీ దక్షిణాది ఆహారమైన ఇడ్లీ, దోసె, ఇడియప్పం, ఇతర దక్షిణాది వంటకాలపై క్లారిటీ లేదంటున్నారు. ఈ విషయంలో కేంద్రం సవరణలు చేయాలని కోరుతున్నారు. మరోవైపు మధ్యతరగతి ప్రజలకు ఊరట నిచ్చేలా నిత్యావసరాలపై జీఎస్టీని కేంద్రం భారీగా తగ్గించింది..సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దసరా నవరాత్రి ఉత్సవాల మొదటి రోజు కావటంతో ఆ రోజు నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని వస్తువుల విషయంలో ఇడ్లీ, చపాతీ వంటి సందేహాలు ప్రస్తుతం నెలకొన్నాయి. వీటికి ఒకట్రెండు రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.