హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.12 కోట్ల సరకు స్వాధీనం

Wait 5 sec.

హైదరాబాద్‌లో భారీ ఎత్తున మత్తు పదార్థాలు పట్టుబడుతుండటం.. తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. డ్రగ్స్ ముఠాలు, డ్రగ్స్ సరఫరా, డ్రగ్స్ తీసుకునేవారు ఇలా.. చాలా మంది అధికారులకు పట్టుబడుతున్నారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు.. డ్రగ్స్ రాకెట్ ముఠా ఆటలు బయటికి వస్తున్నాయి. ఇప్పటికే రకరకాల ప్రభుత్వ సంస్థలు.. డ్రగ్స్ రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతుండగా.. తెలంగాణ ప్రభుత్వం ఈగల్ టీమ్‌ను ఏర్పాటు చేసి మరీ.. మత్తు పదార్థాలకు చెక్ పెట్టేందుకు అనేక చర్యలు చేపడుతున్నాయి. అయినప్పటికీ.. హైదరాబాద్‌లో భారీ మొత్తంలో డ్రగ్స్ బయటపడుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో దొరికిన డ్రగ్స్‌కు.. ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠాలకు లింకులు ఉండటం మరింత ఆందోళనగా మారింది. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు.. చేపట్టిన తనిఖీల్లో దుబాయ్ నుంచి వచ్చిన ఓ భారత ప్రయాణికుడి వద్ద హైడ్రో ఫోనిక్ గంజాయి లభించింది. విమానం దిగి వస్తున్న ఆ వ్యక్తి అనుమానంగా కనిపించడంతో హైదరాబాద్ జోనల్ యూనిట్‌ ప్రశ్నించారు. అతడు ఇచ్చిన సమాధానాలతో వారికి మరింత అనుమానం పెరిగింది. దీంతో అతడి బ్యాగ్‌ను చెక్ చేశారు. అందులో భారీ మొత్తంలో ఈ హైడ్రో ఫోనిక్ గంజాయి ప్యాకెట్లు లభ్యమైనట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. మొత్తంగా రూ.12 కోట్ల విలువైన 12 కిలోల ఈ గంజాయి దొరికినట్లు డీఆర్ఐ అధికారులు వివరించారు. ఆ వ్యక్తి బ్యాగులో గ్రీన్ కలర్‌లో ముద్దగా ఉన్న పదార్థాన్ని నింపిన కొన్ని ప్యాకెట్లు లభించినట్లు తెలిపారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని.. పరీక్షలు చేయగా.. అది ఒక రకమైన గంజాయికి సంబంధించిన పదార్థం అని అధికారులు గుర్తించారు. దీంతో అతడి లగేజీ నుంచి 6 కిలోల హైడ్రో ఫోనిక్ గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. క మరో ప్రయాణికురాలి బ్యాగును చెక్ చేయగా.. అందులో కూడా ఇంకో 6 కిలోల హైడ్రో ఫోనిక్ మిశ్రమం దొరికినట్లు వెల్లడించారు. మొత్తంగా 12 కిలోల హైడ్రో ఫోనిక్ పదార్థం దొరికిందని.. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.12 కోట్లు విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ ఇద్దరు ప్రయాణికులను ఎన్‌డీపీఎస్ చట్టం 1985 కింద అరెస్ట్ చేసినట్లు వివరించారు. అయితే ఈ గంజాయిని ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు.. దాన్ని ఎక్కడ విక్రయిస్తారు.. ఈ డ్రగ్స్ ముఠా వెనుక ఎవరెవరు ఉన్నాయి అనేదానిపై వారిని అధికారులు విచారణ జరపనున్నారు.