రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, సామాన్య ప్రజానీకానికి ఉపాధి అందించేందుకు ప్రభుత్వాలు పెట్టుబడులను ఆకర్షించే పనిలో ఉంటాయి. ఇందుకోసం కంపెనీలకు పలు ప్రోత్సాహకాలు కూడా అందిస్తుంటాయి. కంపెనీలు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను ఏర్పాటు చేస్తే.. నలుగురికి ఉపాధి దొరుకుతుందని.. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయనేది ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు తక్కువ ధరకే ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ ఉంటారు. లీజుకు లేదా నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి భూమి విషయంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం నుంచి భూమిని తీసుకున్న సంస్థలు.. పరిశ్రమలను ఏర్పాటు చేయకపోతే.. వారి వద్ద నుంచి భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. *ప్రభుత్వం నుంచి భూమిని తీసుకున్న తర్వాత పరిశ్రమలను అభివృద్ధి చేయకపోతే.. అలాంటి పారిశ్రామికవేత్తల నుంచి భూమిని తిరిగి తీసేసుకోవాలని ప్రభుత్వం నిశ్చయించుకుందని ఏపీ పరిశ్రమల శాఖ అన్నారు. ఈ విధంగా ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి భూమిని తీసుకుని.. పరిశ్రమ ఏర్పాటులో జాప్యం జరుగుతున్న అనేక సంస్థలను వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. అసెంబ్లీలో శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, వేమిరెడ్డి ప్రశాంతి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ 15 నెలల పాలనలో ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించిందని, కొత్త పారిశ్రామిక విధానంపై వాటాదారులు కూడా పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారని అన్నారు.*దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాలను ఏపీ ప్రభుత్వం అనుసరిస్తోందని మంత్రి టీజీ భరత్ అన్నారు. సమగ్ర ఆర్థిక అభివృద్ధి కోసం వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు కోసం ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు అదనపు ప్రోత్సాహకాలు అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించినట్లు వివరించారు. రైలు, రోడ్లు ఇతర అనుసంధానం లేని ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వారికి అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు వివరించారు. * చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత 15 నెలల కాలలో వివిధ పరిశ్రమల కోసం ఇప్పటి వరకూ పదివేల ఎకరాలకు పైగా భూములను కేటాయించినట్లు వెల్లడించారు. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో పరిశ్రమల ఏర్పాటు కోసం కేవలం 8 వేల ఎకరాలు మాత్రమే కేటాయించారని వివరించారు. 15 నెలల్లోనే ఇన్ని పెట్టుబడులు వచ్చాయంటే.. యువతకు హామీ ఇచ్చినట్లుగా 20 లక్షల ఉద్యోగాల కల్పనను చేరుకుంటామని మంత్రి వివరించారు.