923 ఎకరాల ఆక్రమణలను రక్షించిన హైడ్రా.. రూ.50 వేల కోట్ల ప్రభుత్వ భూములు సేఫ్

Wait 5 sec.

హైదరాబాద్‌ నగరంలో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలను కాపాడేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. హైడ్రాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని వర్గాల నుంచి ఏర్పాటుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. మరికొన్ని వర్గాలు మాత్రం హైడ్రాను స్వాగతిస్తున్నాయి. చెరువులు, కుంటలు సహా ప్రభుత్వ భూములను హైడ్రా అధికారులు కాపాడుతున్నారని చెబుతుండగా.. పేద, సామాన్య ప్రజల ఇళ్లను అక్రమంగా కూల్చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ.. తాము ఆక్రమణలను కాపాడుతున్నామని.. హైడ్రా అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలిపారు.హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తంగా 923 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి రక్షించామని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ వెల్లడించారు. సుమారు రూ.50 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఇప్పటివరకు రక్షించినట్లు తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో ఇప్పటివరకు దాదాపు 60 చెరువులు కనుమరుగయ్యాయని చెప్పారు. వీటిలో 6 చెరువులను మళ్లీ గతంలో ఉన్నప్పటి విధంగా మార్చినట్లు ఏవీ రంగనాథ్ వివరించారు. కొందరు రౌడీషీటర్లు గాజుల రామారంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు ఏవీ రంగనాథ్ తెలిపారు. ఆ ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలోని ఆక్రమణలనే ఆదివారం రోజున తొలగించినట్లు చెప్పారు. నకిలీ పట్టాలు తీసుకుని అక్కడ నిర్మాణాలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రభుత్వ భూమిలో ఉన్న 260 నిర్మాణాలను తొలగించామని తెలిపారు. ప్రస్తుతం 51 డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నాయని.. వాటిని త్వరలోనే 72కు పెంచుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో 150 మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ టీమ్స్‌ ఉన్నాయని.. నాలాల వద్ద ఆక్రమణలు గుర్తించి తొలగిస్తున్నట్లు వివరించారు. నాలాల్లో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. వర్షం పడితే వచ్చే వరద నీరు చెరువుల్లోకి వెళ్లే పరిస్థితి గానీ.. వాటిని నిల్వ చేసే పరిస్థితి గానీ లేదని.. అదే సమయంలో నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్ కావడం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేదని పేర్కొ్న్నారు. అధిక కాలుష్యం వల్ల నగరాల్లోనే వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయని.. భవిష్యత్‌ అంతా యువతదే కాబట్టి పార్కులు, చెరువుల గురించి జన్‌ జడ్ ఆలోచించాలని ఈ సందర్భంగా యువతకు ఏవీ రంగనాథ్‌ సూచించారు.