ఏపీలో రేపు ఈ జిల్లాల్లో భారీ వానలు.. పిడుగులు పడే ఛాన్స్.. అధికారుల హెచ్చరిక

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. ఆదివారం రోజున పలు జిల్లాల్లో మోస్తరు నుంచి కురవనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరికొన్ని గంటల్లో ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని శనివారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద నిలబడరాదని సూచించింది. అలాగే ఈదురుగాలులు వీచే సమయంలో హోర్డింగ్స్ కింద నిలబడరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో ఆదివారం ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో ఏపీవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నంద్యాల జిల్లాలోని ఉయ్యాలవాడ, మహానందిలోభారీ వర్షం కురిసింది. భారీ వర్షాలతో కోవెలకుంట్ల-జమ్మలమడుగు మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు వంతెన మధ్యలో చిక్కుకుపోగా.. అధికారులు జేసీబీ సాయంతో బస్సులోని ప్రయాణికులను కాపాడి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మహానంది మండలంలో పాలేరు వాగు ఉద్ధృతితో సమీప ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు అన్నమయ్య జిల్లా రాయచోటిలో శుక్రవారం రోజు రాత్రి భారీ వర్షం బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. భారీ వర్షానికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వరదనీటిలో కొట్టుకుపోయి గణేష్, షేక్ ముని, ఇలియాస్, యామిని అనే నలుగురు చనిపోయారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు ఐదేసి లక్షల చొప్పున పరిహారం అందించింది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా వ్యక్తిగతంగానూ లక్ష రూపాయల చొప్పున పరిహారం అందించారు.