మొన్నటి వరకు హ్యాండ్ వివాదం చెలరేగగా.. తాజాగా దాంతో ఫ్యాన్స్ కూడా రవుఫ్‌పై కౌంటర్ అటాక్‌కు దిగారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో 6 -0తో చేసిన హావభావాలు ఇప్పుడు భారతీయుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. హారిస్ రవుఫ్ చేసిన తీరు ఒక స్పోర్ట్స్‌మన్‌కు ఉండాల్సిన ఇది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హారిస్ రవుఫ్ చేసిన 6-0 సిగ్నల్ పాకిస్తాన్ చేస్తున్న ఒక అబద్ధపు ఆరోపణ. ఈ ఏడాది మే నెలలో సమయంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి సంబంధించిన ఆరు ఫైటర్ జట్లను పాక్ కూల్చేసిందంటూ అక్కడ ఆర్మీ ఆరోపణలు చేసింది. రవుఫ్ కూడా సరిగ్గా 6 -0 నెంబర్స్ చూయిస్తూ, ఫైటర్ జెట్స్ కిందపడినట్లు హావభావాలతో బౌండరీ లైన్ దగ్గర టీమిండియా ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టాడు. హారిస్ రవుఫ్ చేసిన అతికి టీమిండియా ఫ్యాన్స్ కూడా అదే రేంజ్‌లో కౌంటర్ అటాక్ ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్ 2022లో రవుఫ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఆ సిక్సర్లు మ్యాచ్ విజయంలో కీలకంగా మారాయి. దాంతో టీమిండియా ఫ్యాన్స్ ఆ ఇన్సిడెంట్ గుర్తుకు వచ్చేలా కోహ్లి కోహ్లి అంటూ స్టేడియంలో నినాదాలు చేశారు. రవుఫ్ చేసిన 6 - 0కి టీమిండియా 7 - 0తో సమాధానం చెప్పింది. భారత్ ఇటీవల కాలంలో పాకిస్తాన్‌తో ఆడిన ఆఖరి ఏడు మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. పాకిస్తాన్ ఈ ఏడు మ్యాచ్‌లలో కనీసం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా విజయం సాధించలేదు. ఇదే విషయాన్ని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తావిస్తూ ఇకపై భారత్ - పాక్ పోరు, భారత్ - పాక్ సమరం లాంటివి అనొద్దు.. ఎందుకంటే భారత్‌తో పోటీపడే స్థాయిలో పాక్ లేదని చురకలు అంటించాడు.