తిరుమలలో పరిశుభ్రతకు సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. టీటీడీకి ఆరోగ్య విభాగానికి రూ.19 లక్షల విలువైన 18 క్లీనింగ్ మెషీన్లను విరాళంగా అందించారు. కార్పొరేట్ సోషియల్ రెస్పాన్స్‌బిలిటీ (CSR) లో భాగంగా IDBI బ్యాంక్ ఈ మెషీన్లను అందజేసింది. ఈ మేరకు ఆ బ్యాంకు ఎండీ&సీఈవో రాకేష్ శర్మ శ్రీవారి ఆలయం ముందు పేష్కార్ రామకృష్ణకు యంత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో ఆరోగ్య శాఖ సోమన్నారాయణ, టీటీడీ ఆరోగ్యాధికారి డా మధుసూదన్, ఐడీబీఐ బ్యాంక్ రీజనల్ హెడ్ సాయికృష్ణ, తిరుపతి బ్రాంచ్ హెడ్ పల్లి రమేష్, బ్రాంచ్ మేనేజర్ దూడల రాజేష్ పాల్గొన్నారు.'యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మల్టీ పర్పస్ క్లీనింగ్ కు ఉపయోగించే రూ.20 లక్షలు విలువైన రోస్సరి ప్రోఫెషనల్ కంపెనీకి చెందిన రాస్ స్ట్రీట్ ఆర్ఓ 1500 రైడ్ ఆన్ స్వీపర్ మెషిన్ ను ఆదివారం సాయంత్రం విరాళంగా అందించింది. శ్రీవారి ఆలయం ముందు అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరుపతి జీఎం పత్రి శ్రీనివాస్ ఈ మెషిన్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, ఆరోగ్యాధికారి డా. మధుసూదన్, యూనియన్ బ్యాంక్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ కు చెందిన బిగాస్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శనివారం రూ.1.10 లక్షలు విలువైన బిగాస్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను టీటీడీకి విరాళంగా అందించింది. ఈ మేర‌కు శ్రీ‌వారి ఆల‌యం ఎదుట ఏఈవో మోహన్ రాజుకు ఆ సంస్థ ఆర్ఎస్ఎం కె.రామారావు స్కూట‌ర్ తాళాలు అందించారు' అని టీటీడీ తెలిపింది. 'తిరుమల పవిత్రత, ప్రశాంతత కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ముఖ్యంగా భక్తులకు సరైన సమాచారం అందించే విషయంలో మీడియా పాత్ర మరింత కీలకమైనదని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శనివారం టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణతో కలిసి మీడియా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మీడియా ప్రతినిధుల నుంచి ప్రయోజనకరమైన సూచనలను ఎల్లప్పుడూ స్వాగతిస్తామని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేగంగా పెరుగుతోందని, కానీ చాలామంది యూట్యూబర్లు భక్తులకు సరైన సమాచారం ఇవ్వకుండా, అవాస్తవ మైన ఆధారరహిత వార్తలతో గందరగోళానికి గురి చేస్తున్నారని చెప్పారు. ఇటువంటి తప్పుడు వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఉండే శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తినే అవకాశం ఉంటుందని తెలిపారు' టీటీడీ ప్రకటన విడుదల చేసింది. 'తిరుమల కొండల పవిత్రతను కాపాడటం, టీటీడీ కార్యక్రమాలను ప్రోత్సాహించే విషయంలో మీడియాపై ఎంతో బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. తిరుమలలో ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధులకు తిరుమలలో జరుగుతున్న అభివృద్ధిపై, భక్తులకు టీటీడీ అందిస్తున్న విశేష సేవలపై ఎంతో అవగాహన ఉంటుందని తెలిపారు. టీటీడీపై అసత్య కథనాలతో దుష్ప్రచారం చేసే వారిని నియంత్రించేందుకు మీడియా ప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వాస్తవాలను ప్రజలకు చేరవేయాలని కోరారు' టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి.