మెస్సీ కోల్‌కతా పర్యటనలో గందరగోళం.. స్టేడియంలోకి దూసుకొచ్చిన అభిమానులు!

Wait 5 sec.

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటనలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ది గోట్ టూర్‌‌లో భాగంగా మెస్సీ మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చాడు. శనివారం తెల్లవారు జామున కోల్‌కతాలో ల్యాండ్ అయ్యాడు. షెడ్యూల్ ప్రకారం అతడు కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మ్యాచ్ ఆడాల్సి ఉంది. దీంతో అతడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు.మెస్సిని దగ్గరి నుంచి చూడాలని.. ఆటను వీక్షించాలని అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. అయితే మెస్సి మాత్రం.. మ్యాచ్ ఆడకుండానే స్టేడియం నుంచి వెళ్లిపోయాడు. అలా వచ్చి.. ఇలా మైదానం వీడాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. మెస్సి కోసం వస్తే.. పది నిమిషాలు కూడా లేకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మైదానంలోకి కుర్చీలు, వాటర్ బాటిల్లు విసిరేశారు. దీంతో సాల్ట్ లేక్ మైదానంలో ఊహించని పరిణామాలు జరిగాయి.స్టేడియంలో గందరగోళ పరిస్థితుల మధ్య ముందుగా నిర్ణయించిన ఈవెంట్లను నిర్వాహకులు.. నిర్వహించలేకపోయారు. అయితే మెస్సిని చూసేందుకు రూ.1000కి పైగా టికెట్ కోసం వస్తే.. అతడు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అతడు మైదానం వీడిన మరుక్షణమే స్టేడియంలోకి దూసుకొచ్చి.. టెంట్లు, తాత్కాలిక నిర్మాణాలను ధ్వంసం చేశారు. అక్కడి సిబ్బంది వారిని నియంత్రించలేకపోయారు. కాగా సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఘటనలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ సందర్భంగా మెస్సికి, అతడి అభిమానులకు క్షమాపణ చెప్పారు. స్టేడియంలో జరిగిన నిర్వహణ లోపాన్ని చూసి.. షాక్ అయినట్లు చెప్పారు. మెస్సిని చూసేందుకు తాను కూడా బయలుదేరానని.. కానీ అక్కడి పరిస్థితి గురించి తెలుసుకుని వెనుదిరిగినట్లు పేర్కొన్నారు. నిర్వహణ వైఫల్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై విచారణ కోసం జస్టిస్ అషిమ్ కుమార్ అధ్యక్షతన విచారణ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మెస్సి ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు.