ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ.. దేశంలోని తొలి అటానమస్ మారీటైమ్ షిప్ యార్డ్.. ఆ జిల్లాలోనే, ఫిక్స్..

Wait 5 sec.

Juvvaladinne: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక సంస్థ కొలువుదీరనుంది. భారతదేశ సముద్ర, రక్షణ తయారీ పర్యావరణ వ్యవస్థలో మైలురాయిగా నిలిచే ప్రాజెక్టు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఏర్పాటు కానుంది. నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని ఫిషింగ్ హార్బర్‌లో భారతదేశంలోనే తొలి అటానమస్ మారీటైమ్ షిప్‌యార్డ్ అండ్ సిస్టమ్స్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు కానుంది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో దీనిని ఏర్పాటు చేయడానికి సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. ఈ సంస్థ చేసిన ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ ప్రతిపాదన ప్రకారం మారీటైమ్ షిప్ యార్డ్ అండ్ సిస్టమ్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సాగర్ డిఫెన్స్ సంస్థ అభివృద్ధి చేయనుంది. స్వయంప్రతిపత్తి గల మారీటైమ్ షిప్ యార్డుగా దీనిని అభివృద్ధి చేయనుంది. ఈ కేంద్రం ఏర్పాటు వలన 750 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. 300 మందికి ప్రత్యక్షంగా, 450 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు చెప్తున్నారు. అలాగే ఏపీ తీర ప్రాంతంలో ఇండిస్ట్రియల్ అండ్ స్కిల్స్ ఎకోసిస్టమ్‌ను ఈ ప్రాజెక్టు బలోపేతం చేస్తుందని అంచనా వేస్తున్నారు.మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి షిప్‌యార్డులు చాలా కీలకమైనవని అధికారులు చెప్తున్నారు. మెరుగైన తీరప్రాంత నిఘాతో పాటుగా, తీరప్రాంత భద్రత, రక్షణ సంసిద్ధతకు అనుగుణంగా ఉంటాయని వివరిస్తున్నారు. దేశీయంగా రక్షణ రంగ సాంకేతికత అభివృద్ధికి మద్దతుగా జువ్వలదిన్నె వద్ద ప్రతిపాదించిన షిప్ యార్డు నిలుస్తుందని అధికారులు చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద 29.58 ఎకరాల భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ మారీటైమ్ బోర్డు ద్వారా లీజు ప్రాతిపదికన ఈ భూమిని కేటాయించనున్నారు. ఈ భూమిలో 7.58 ఎకరాల సముద్ర తీర భూమి, 22.00 ఎకరాల హార్బర్ భూమి ఉంది, షిప్‌యార్డ్ నిర్మాణం ఒకట్రెండు నెలల్లో ప్రారంభించాలని ఆలోచనలు చేస్తున్నారు. అలాగే 2026 అక్టోబర్ నెలలో ట్రయల్ ప్రొడక్షన్ నిర్వహించాలని ఆలోచనలు చేస్తున్నారు. నవంబర్ నుంచి వాణిజ్య పరమైన కార్యకలాపాలు మొదలు పెట్టాలని అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. మరోవైపు సాగర్ డిఫెన్స్ సంస్థ చేసిన ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి డిసెంబర్ నాలుగో తేదీన ఆమోదం తెలిపింది. అలాగే ఈ ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యేలా తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపీ మారీటైమ్ బోర్డు, మత్స్య శాఖ, జలవనరులు, విద్యుత్ శాఖలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేశించింది.