బీటెక్ మూడో ఏడాది మానేస్తే బీఎస్సీ డిగ్రీ.. విద్యార్థులకు మద్రాస్ ఐఐటీ బంపరాఫర్

Wait 5 sec.

బీటెక్‌ డిగ్రీ పూర్తిచేయడానికి ఇబ్బంది పడుతోన్న విద్యార్థులకు బంపరాఫర్ ప్రకటించింది. బీటెక్‌లో చేరిన విద్యార్థులు మూడేళ్ల తర్వాత బిఎస్సీ డిగ్రీతో బయటకు వెళ్లొచ్చని ప్రకటించింది. కానీ, మొత్తం 400 క్రెడిట్లలో 250 క్రెడిట్లను సాధిస్తేనే నిష్క్రమణకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ విధానం 2024 బ్యాచ్ నుంచే అమలు చేయనున్నట్టు తెలిపింది. గతేడాది బీటెక్‌లో చేరిన విద్యార్థులు 2027 నుంచి ఈ ఎంపికను ఉపయోగించుకోవచ్చు. అయితే, ఈ విద్యార్థులు బీఎస్సీ డిగ్రీని ఎంచుకోవడానికి ముందు, కనీసం ఒక్కసారైనా డిగ్రీని పూర్తిచేయడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. డీన్ (అకడమిక్) ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మాట్లాడుతూ.. ‘‘స్పెషలైజేషన్‌తో కూడిన బీఎస్సీ కోర్సును కూడా అందించాలని ప్లాన్ చేస్తున్నాం.. ప్రతి విభాగం స్పెషలైజేషన్ కోసం అవసరమైన కోర్ క్రెడిట్ల సంఖ్యను నిర్దేశిస్తుంది’’ అని అన్నారు. ‘‘ఈ డిగ్రీ ద్వారా విద్యార్థులు ఎంబీఏ సహా ఉన్నత విద్యలో చేరవచ్చు, సివిల్స్‌ కూడా రాసుకోవచ్చు.. అలాగే, మధ్యలోనే బయటికెళ్లినవారు మా ఆన్‌లైన్ బీఎస్ డిగ్రీ కోర్సులో చేరవచ్చు’’ అని ఆయన తెలిపారు.‘ఇష్టం లేకుండా కొందరు ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా మారిన తర్వాత కోర్సును మధ్యలోనే వదిలేస్తారు... అటువంటి విద్యార్థులు ఈ డిగ్రీని ఎంపిక చేసుకోవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఐఐటీ మద్రాసు ఈ విధానం తీసుకొస్తుంది. విద్యార్థులపై భారాన్ని తగ్గించేందుకు ఐఐటీ మద్రాస్ సెమిస్టర్‌కు అవసరమైన కనీస క్రెడిట్ల సంఖ్యను 10% తగ్గించడంతో సహా అనేక సంస్కరణలను ఇప్పటికే ప్రవేశపెట్టింది.‘‘సాధారణంగా సెమిస్టర్‌లో ఓ విద్యార్థి సులభంగా 66 శాతం క్రెడిట్లను సాధించగలడు.. కానీ, మేము అవసరమైన క్రెడిట్ల సంఖ్య 50 శాతానికి కుదించాం.. అత్యధిక సీజీపీఏ సాధించిన విద్యార్థులు సెమిస్టర్‌లో ఎక్కువ క్రెడిట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది’’ అని ప్రొఫెసర్ హరిదాస్ చెప్పారు. ఇంకా, ఐఐటీ మద్రాస్ బిటెక్ ప్రోగ్రామ్‌లోని 40% కోర్సులను ఎంపికలుగా చేసింది, తద్వారా విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. విద్యార్థులకు మరిన్ని ఎంపికలను అందించడానికి ఇంటర్ డిసిప్లినరీ డ్యూయల్ డిగ్రీలు, మైనర్ డిగ్రీలను కూడా ప్రవేశపెట్టింది.