ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన అఖిలేష్ యాదవ్.. ఆ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ సహాయ శాఖ మంత్రి కుమార్.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరి సమావేశాలను మ్యాథ్స్ ఫార్ములాను ఉదహరిస్తూ. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెర వెనుక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకటే అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకరికి మరొకరు.. బీ టీమ్‌గా పనిచేస్తున్నాయని బండి సంజయ్ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ బహిరంగంగా ప్రత్యర్థి అని చెప్పినా.. ఢిల్లీలో అదే వ్యవస్థలో భాగమైన వారితో చేతులు కలుపుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్‌లతో అఖిలేష్ యాదవ్ భేటీల నేపథ్యంలో.. ఆదివారం ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. A అనేది.. B కి దగ్గరగా.. , B అనేది Cకి దగ్గరగా ఉంటే.. A, C లు ఎక్కడ ఉంటాయో తెలుసుకోవడానికి సమీకరణాలు అవసరం లేదని ఉదాహరణగా చూపిస్తూ ట్వీట్‌ చేశారు. ఈ ఉదాహరణతో ఎవరు ఎవరి B టీమ్‌గా పనిచేస్తున్నారో అందరికీ తెలుసని పరోక్షంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను పార్టీలపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. వ్యవస్థను వ్యతిరేకిస్తున్నాను అని చెప్పుకునే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. అదే వ్యవస్థలో భాగమైన వారితో.. మరీ ముఖ్యంగా ఢిల్లీలో తరచుగా చేతులు కలుపుతూనే ఉన్నారని బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బహిరంగ ప్రసంగాల్లో బీఆర్‌ఎస్‌ను తమ ప్రత్యర్థిగా చూపిస్తున్నప్పటికీ.. తెర వెనుక, మూసిన గదుల్లో మాత్రం ఇద్దరూ ఒకటేనని ఎద్దేవా చేశారు. ఒకే సర్కిల్, ఒకే సౌకర్యం.. కెమెరాల ముందు మాత్రం ప్రత్యర్థులుగా ప్రసంగాలు అంటూ బండి సంజయ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్‌లతో సమావేశమైన ఫోటోలను అఖిలేష్ యాదవ్ తన ట్విటర్‌ పేజీలో పోస్ట్ చేయగా.. ఆ పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ.. ఆ ఆరోపణలు గుప్పించారు. ఈ మ్యాథమెటిక్స్ ఫార్ములాను ఉపయోగించి కాంగ్రెస్-బీఆర్‌ఎస్ రాజకీయ మైత్రిని ఎత్తిచూపే ప్రయత్నం చేశారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.