తిరుమల శ్రీవారికి బ్యాంక్ భారీ విరాళం.. ఆ మెషిన్ల కోసం డీడీ ఇచ్చారు, ఎంతంటే!

Wait 5 sec.

తిరుమల శ్రీవారికి భక్తులు భారీగా విరాళాలు, కానుకలు అందజేస్తుంటారు. భక్తులు మాత్రమే కాదు బ్యాంకులు కూడా టీటీడీకి విరాళాలు అందిస్తున్నాయి. టీటీడీకి అవసరమైన మెషిన్లను కూడా విరాళంగా అందజేస్తుంటాయి. తాజాగా ఇండియన్ బ్యాంక్ టీటీడీకి విరాళం ఇచ్చింది. తిరుమలా అలిపిరి చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేయనున్న సెక్యూరిటీ లగేజీ స్కానర్ కోసం శుక్రవారం ఇండియన్ బ్యాంక్ రూ.37,97,508 టీటీడీకి విరాళంగా అందించింది. ఈ మేరకు లోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి ఇండియన్ బ్యాంక్ ఫీల్డ్ మేనేజర్ ప్రణేశ్ కుమార్ విరాళం డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ ఎం సెల్వరాజ్, డిప్యూటీ జోనల్ మేనేజర్ ఇందిర, తిరుమల బ్రాంచ్ మేనేజర్ రాఘవేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ బ్యాంక్‌ను అడిషనల్ ఈవో అభినందించారు. హైదరాబాద్ కు చెందిన హిమశ్రియ దంతు అనే భక్తురాలు టీటీడీ స్విమ్స్ ట్రస్టుకు శుక్రవారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు. అదేవిధంగా ఫ్లాష్ లైన్ ఈఎంఎస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు వారి ప్రతినిధి కుప్పాల నీలేష్ కుమార్ తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. ఈ సందర్భంగా భక్తులను అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి అభినందించారు. అధ్యయనోత్సవాలు ప్రారంభంఆలయంలో 25 రోజుల పాటు జ‌రుగ‌నున్న అధ్యయనోత్సవాలు సాయంత్రం ఘనంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు రంగ‌నాయ‌కుల మండ‌పంలో అధ్య‌య‌నోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జియ్యంగార్లు గోష్ఠిగానం చేస్తారు. కాగా ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్‌‌స్వామి, తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్‌‌స్వామి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.మరోవైపు తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయానికి తిరుచానూరు కెనరా బ్యాంక్ ప్రతినిధులు క్యాష్ కౌంటింగ్ మిషన్‌ను విరాళంగా ఆలయంలో అందించారు. ఈ మేరకు క్యాష్ కౌంటింగ్ మిషన్ ను ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ కు కెనరా బ్యాంక్ ప్రతినిధులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ మునిచెంగల్ రాయలు, ఇతర అధికారులు కెనరా బ్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు.