సముద్రాన్ని వెనక్కి నెట్టి భూమిని బయటికి తెచ్చిన నెదర్లాండ్స్.. ఏకంగా కొత్త రాష్ట్రం ఏర్పాటు, ఎలా చేశారంటే?

Wait 5 sec.

దేశ చరిత్ర, దాని భౌగోళిక స్వరూపం ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైనది. "ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు.. కానీ డచ్ వారు మాత్రం నెదర్లాండ్స్‌ను సృష్టించారు" అనే సామెత అక్షర సత్యం. నెదర్లాండ్స్ దేశంలో దాదాపు 26 శాతం భూభాగం.. సముద్ర మట్టం కంటే తక్కువలో ఉంది. దీంతో గత కొన్ని శతాబ్దాలుగా సముద్రంతో పోరాడుతున్న నెదర్లాండ్స్.. సముద్రపు నీటిని వెనక్కి నెట్టి.. భూమిని స్వాధీనం చేసుకుంటూ కొత్త పట్టణాలు, నగరాలు, రాష్ట్రాలను సృష్టిస్తోంది. ఇలా సముద్రం నుంచి భూమిని వెలికితీసే ప్రక్రియను ల్యాండ్ రెక్లమేషన్ అని పిలుస్తారు. ఈ ల్యాండ్ రెక్లమేషన్ ప్రక్రియతో ఫ్లెవోలాండ్ రాష్ట్రాన్ని తయారు చేసింది. భూభాగం తక్కువగా ఉన్నప్పటికీ.. సముద్రం తమను మింగేస్తున్నా ఏమాత్రం భయపడకుండా.. ఏకంగా సముద్రపు అడుగు భాగం నుంచి భూమిని వెలికితీసి ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ ద్వీపాన్ని నెదర్లాండ్స్ నిర్మించింది. అదే నెదర్లాండ్స్‌లోని 12వ రాష్ట్రంగా ఫ్లెవోలాండ్ ఏర్పడింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన పోల్డర్ వ్యవస్థనెదర్లాండ్స్‌లో ల్యాండ్ రెక్లమేషన్ (భూమిని స్వాధీనం చేసుకోవడం) అనేది ఒక అద్భుత ప్రక్రియ. దీన్ని నెదర్లాండ్స్‌లో పోల్డర్ విధానం అని అంటారు. ఈ విధానంలో భాగంగా సముద్రంలో డైక్స్‌ను నిర్మిస్తారు. డైక్స్ అంటే సముద్రం లేదా సరస్సు మధ్యలో పెద్ద గట్లను కట్టడం. గట్లు కట్టిన తర్వాత ఆ గట్ల మధ్య ఉన్న నీటిని భారీ మోటర్ల సాయంతో తిరిగి సముద్రంలోనికి పంపిస్తారు. గతంలో ఇలా నీటిని గట్లలో నుంచి బయటికి పంపించే పనిని గాలిమరలు చేసేవి. కానీ ఇప్పుడు అత్యాధునిక విద్యుత్ పంపులు అందుబాటులోకి రావడంతో పని మరింత సులభం అయింది. 15వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఈ గాలిమరలను ఉపయోగించారు. నీటిని మొత్తం బయటికి పంపించిన తర్వాత.. బురద ఏర్పడుతుంది. విమానాల నుంచి ఆ బురుదలోకి గడ్డి విత్తనాలను చల్లుతారు. ఆ తర్వాత ఆ భూమిని నివాసాలకు అనువుగా మార్చుతారు. ఆ విత్తనాలు గడ్డిగా పెరిగి వేగంగా నీటిని పీల్చుకుని భూమిని గట్టిపడేలా చేస్తుంది. జుయిడర్జీ ప్రాజెక్ట్.. ఒక మహా సంకల్పంఒకప్పుడు నెదర్లాండ్స్ మధ్యలో జుయిడర్జీ అనే ఉప్పునీటి సముద్రపు అగాధం ఉండేది. 1932లో అఫ్స్లూయిట్ డైక్ అనే 32 కిలోమీటర్ల భారీ ఆనకట్టను నిర్మించి.. సముద్రాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత నీటిని తోడేసి ప్రక్రియను 1942, 1957, 1968లలో మూడు దశల్లో పూర్తి చేసి.. ఎట్టకేలకు భూమిని బయటికి తీశారు. ఇలా వెలికి తీసిన భూభాగమే ఇప్పటి ఫ్లెవోలాండ్. ఇది నేడు సముద్ర మట్టం కంటే 5 మీటర్ల లోతులో ఉంటుంది. ప్రస్తుతం వేల సంఖ్యలో ప్రజలు నివసిస్తున్న ఫ్లెవోలాండ్.. వంద ఏళ్ల క్రితం సముద్రపు అడుగుభాగంగా ఉండేది. చివరికి 1986 జనవరి 1వ తేదీన అధికారికంగా ఫ్లెవోలాండ్ పేరుతో నెదర్లాండ్స్ 12వ రాష్ట్రాన్ని ప్రకటించారు.మూడు దశల భూసేకరణనార్త్ ఈస్ట్ పోల్డర్ (1942): మొదట ఉత్తర భాగాన్ని ఎండబెట్టారు. దీంతో అప్పటివరకు ద్వీపాలుగా ఉన్న ఉర్క్, షాక్లాండ్ నెదర్లాండ్స్‌లో కలిసిపోయాయి.ఈస్ట్ ఫ్లెవోలాండ్ (1957): రెండో దశలో తూర్పు భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ప్రస్తుత రాజధాని లెలీస్టాడ్ ఏర్పడింది.సౌత్ ఫ్లెవోలాండ్ (1968): చివరిగా దక్షిణ భాగాన్ని పూర్తి చేశారు. ఇక్కడ ఆధునిక నగరమైన అల్మెరే ఏర్పాటైంది.డెల్టా వర్క్స్.. సముద్రానికి సంకెళ్లు1953లో నెదర్లాండ్స్‌లో వచ్చిన భయంకర సముద్రపు వరదలతో 1800 మంది మరణించారు. ఆ తర్వాత డచ్ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఆ తర్వాత డెల్టా వర్క్స్ అనే రక్షణ వ్యవస్థను నిర్మించింది. 9 కిలోమీటర్ల పొడవైన భారీ గేట్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాన్నే ఓస్టెర్‌షెల్డెకెరింగ్ అని పిలుస్తారు. తుఫాను వచ్చినప్పుడు ఈ గేట్లు ఆటోమేటిక్‌గా అవే మూసుకుపోయి సముద్రపు నీరు ఊళ్లోకి రాకుండా అడ్డుకుని వరదలను తగ్గిస్తాయి. వీటితోపాటు ఈఫిల్ టవర్ అంత పొడవు ఉండే రెండు భారీ ఇనుప రెక్కలను ఏర్పాటు చేసి.. వాటి ద్వారా సముద్రపు నీటిని అడ్డుకోవడం నెదర్లాండ్స్ ఇంజనీరింగ్ ప్రత్యేకత. దీన్ని మేస్లాంట్‌కెరింగ్ అంటారు. భవిష్యత్తు నగరాలు, ఆధునిక వ్యవసాయంసముద్రం అడుగున పుట్టిన అల్మెరే నగరం ఇప్పుడు ఒక ఆర్కిటెక్చర్ మ్యూజియంగా ప్రఖ్యాతి చెందింది. సముద్రం నుంచి వెలికితీసిన నేల చాలా సారవంతంగా ఉంటుంది. దీంతో డ్రోన్లు, సెన్సార్ల సాయంతో అక్కడ అత్యుత్తమ వ్యవసాయం (ప్రిసిషన్ ఫార్మింగ్) చేస్తున్నారు. మరోవైపు.. భూమి కొరత ఉన్న చోట నీటిపై తేలే ఇళ్లను నిర్మించి డచ్ వారు ప్రపంచానికి కొత్త పాఠం నేర్పుతున్నారు.సముద్రం నుంచి సేకరించిన భూమికి.. సముద్రపు నీటికి మధ్య సంబంధం లేకుండా కొన్ని పాయలను మూసివేయడం వల్ల కొన్నేళ్లకు అవి మంచి నీటి సరస్సులుగా మారాయి. ఇప్పుడు ఆ మంచి నీటి సరస్సులే.. నెదర్లాండ్స్‌లో ప్రజల తాగునీటికి, వ్యవసాయానికి ఉపయోగపడుతున్నాయి. వాటిపై నిర్మించిన డ్యామ్‌ల పైన రోడ్లను నిర్మించడం వల్ల వివిధ ద్వీపాల మధ్య రవాణా సౌకర్యం పెరిగింది. డచ్ ఇంజినీర్ల నిరంతర కృషి వల్ల నెదర్లాండ్స్ కేవలం భూమిని మాత్రమే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన వ్యవసాయ భూములను కూడా తయారు చేసుకుంది. ప్రస్తుతం వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న సముద్ర మట్టాలను ఎదుర్కోవడంలో డచ్ ఇంజనీర్లు ప్రపంచానికే మార్గదర్శకులుగా నిలిచారు.ఇక ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు డచ్ ఇంజినీర్లకు దాదాపు 30 ఏళ్లకు పైగా సమయం పట్టింది. దీంతో ప్రస్తుత సమయంలో సముద్ర మట్టాలు పెరుగుతుండటాన్ని ఎదుర్కోనేందుకు అమెరికా, వియత్నాం వంటి దేశాలు డచ్ ఇంజనీర్ల సలహాలను తీసుకుంటున్నాయి.