యాదగిరిగుట్ట లవైభవంగా జరిగే వార్షిక అధ్యయనోత్సవాల నేపథ్యంలో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు మొత్తం ఆరు రోజుల పాటు నిత్య కైంకర్యాలైన సుదర్శన నారసింహ హోమం, లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం, జోడు సేవా పర్వాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో వెంకట్రావు ప్రకటించారు. అధ్యయనోత్సవాల నిర్వహణకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.మరోవైపు.. ఈ నెల 30న జరిగే 'ముక్కోటి ఏకాదశి' వేడుకల కోసం యాదగిరిగుట్ట ఆలయం ముస్తాబవుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం అత్యంత చురుగ్గా సాగుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల నుంచే ఆలయ కైంకర్యాలు ప్రారంభం కానున్నాయి. తెల్లవారుజామున 2 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి, స్వయంభూ స్వామివారిని మేల్కొలిపి సుప్రభాత సేవ నిర్వహిస్తారు. అనంతరం ప్రాతఃకాల తిరువారాధన, తిరుప్పావై సేవాకాలం, బాలభోగం వంటి కార్యక్రమాలు పూర్తి చేసి 5.30 గంటలకు భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన 'ఉత్తర ద్వార దర్శనం' కల్పిస్తారు. ఆ తర్వాత తిరువీధి సేవోత్సవం, అధ్యయనోత్సవం, పురవీధి సేవాపర్వాలు ఘనంగా జరగనున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఆలయ వైభవం దేశవ్యాప్తంగా విస్తరించడంతో సామాన్య భక్తుల నుంచి ప్రముఖుల వరకు స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ కడుతున్నారు. సాధారణ రోజుల్లోనే కాకుండా, శని, ఆదివారాలు, సెలవు దినాల్లో భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటోంది. ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన సమయాల్లో స్వల్ప మార్పులు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమవుతుందని.. 10.30 నుంచి 11.30 గంటల వరకు బ్రేక్ దర్శనాలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లు, తాగునీరు, ప్రసాదాల పంపిణీలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఆలయ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. భక్తులు సమయం, సేవా వివరాలను గమనించి స్వామివారిని దర్శించుకోవాలని ఈవో కోరారు.