ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన సహకార ఆర్థిక సంస్థ (ట్రైకార్‌)ను తిరిగి గాడిన పెట్టింది. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాన్ని గత ప్రభుత్వం పక్కన పెట్టింది. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం ఆ పథకాన్ని తిరిగి ప్రారంభించింది. గిరిజన రైతులకు అండగా నిలిచేందుకు ఈ సంస్థ ద్వారా వ్యవసాయ, మత్స్య, ఉద్యాన పరికరాలు అందిస్తారు. ఇందుకోసం రూ.13.70 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో 12వేల మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఐటీడీఏల పరిధిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.వ్యవసాయ, ఉద్యాన, మత్స్యకార రైతుల కోసం పరికరాలను గుర్తించారు. ఈ పథకం ద్వారా రైతుల అవసరాలకు తగినట్లుగా 30 రకాల తెస్తున్నారు. వీటిలో వ్యవసాయానికి, తోటల పెంపకానికి, చేపల పెంపకానికి ఉపయోగపడేవి ఉన్నాయి. ఈ పరికరాలను పొందడానికి రైతులు చాలా తక్కువ మొత్తమే చెల్లించాల్సి ఉంటుంది. రైతులకు లభిస్తుంది.. వారు కేవలం 10 శాతం చెల్లిస్తే సరిపోతుంది.. ఇప్పుడు ఏదైనా పరికరం ధర రూ.లక్ష ఉంటే.. కేవలం రూ.10వేలు కడితే సరిపోతుంది. ఇది రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.చిన్న చిన్న పరికరాలు, తక్కువ ధర ఉన్నవి అయితే ఒక్కొక్క రైతుకు నేరుగా ఇస్తారు. అదే సమయంలో, ట్రాక్టర్లు వంటి ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పరికరాలు కావాలంటే, రైతులు ఒక సంఘంగా ఏర్పడితే వారికి మంజూరు చేస్తారు. పంపిణీ చేయబోయే పరికరాలలో ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, ట్రాలీలు, రోటావేటర్లు (నేలను దున్నడానికి ఉపయోగపడే యంత్రం), ఆయిల్‌ ఇంజిన్లు, పవర్‌ టిల్లర్ (చిన్న ట్రాక్టర్ లాంటిది), పవర్‌ వీడర్ (కలుపు తీసే యంత్రం), టర్మరిక్‌ బాయిలర్స్ (పసుపు ఉడకబెట్టే యంత్రం), స్ప్రేయర్లు (పురుగుమందులు చల్లే యంత్రం), ఫిషింగ్‌ బోట్లు (చేపలు పట్టే పడవలు) వంటివి ఉన్నాయి. గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేసి, స్పెషల్‌ సెంట్రల్‌ అసిస్టెన్స్‌ టు ట్రైబల్‌ సబ్‌స్కీమ్‌ (SCA to TS) కింద ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకువచ్చింది. దీని ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.13.70 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అయితే గత ప్రభుత్వం ఈ నిధులను గిరిజనుల అభివృద్ధికి కాకుండా, ఇతర పనులకు వాడేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధులు ఎలా ఖర్చు చేశారో తెలియజేస్తూ వినియోగ ధృవీకరణ పత్రాలు (UCs) సమర్పించాలని కేంద్రం ఆదేశించింది. కానీ గత ప్రభుత్వంలో ఈ ఆదేశాలను పట్టించుకోలేదు అంటున్నారు. ఇప్పుడు మళ్లీ ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు.