సూపర్ స్టార్ ఎన్ని బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు ఉన్నా.. ఆయన కెరీర్ లో ఎప్పటికీ గుర్తిండిపోయే మెమరబుల్ సినిమాలలో 'మురారి' ఒకటి. 2001లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ చిత్రం.. మహేష్ లోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించడామే కాదు, టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కాలంతో సంబంధం లేకుండా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన ఈ చిత్రం.. డిసెంబర్ 31న రీ-రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా కృష్ణవంశీ సోషల్ మీడియా వేదికగా సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు. అమ్మవారి శాపం తగలడం వల్ల ఒక వంశం ఎలా దెబ్బతిందనే కథాంశంతో 'మురారి' సినిమా రూపొందింది. ఒక జమీందారు 19వ శతాబ్దంలో చేసిన తప్పుకి, ప్రతీ 48 ఏళ్ళకొకసారి అతని వంశస్తుల్లో ఒకరిని బలితీసుకుంటున్న తరుణంలో.. మురారి మరణం నుంచి ఎలా తప్పించుకోగలిగాడు? అమ్మవారి శాపాన్ని ఎలా నివారించి తన వంశాన్ని కాపాడుకున్నాడు? అనేదే ఈ సినిమా మూలకథ. ఇందులో మహేష్ బాబు యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆయన పెర్ఫామెన్స్ నెక్స్ట్ లెవల్ అంతే. క్లైమాక్స్‌ గురించి కృష్ణవంశీ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు. కథలో భాగంగా సినిమా చివర్లో మురారి మరణించకుండా ఉండటానికి వేదపండితులు మృత్యుంజయ హోమం చేస్తారు. ఐతే ఆ సన్నివేశం కోసం నిజమైన వేద పండితులను పిలిపించి.. మురారి పేరు మీద కాకుండా 'ఘట్టమనేని మహేష్ బాబు' పేరు మీదే హోమం చేయించినట్లు కృష్ణవంశీ వెల్లడించారు. మూడు గంటల పాటు ఎంతో నిష్టగా ఈ హోమం చేయించినట్లు ఆయన తెలిపారు. హోమం జరుగుతుండగా మధ్యలో అక్కడక్కడా కొన్ని షాట్స్ తీశామని తెలిపారు. ఆఖర్లో పూర్ణాహుతిని నిజంగానే మహేష్ బాబుతో చేయించామని.. దాన్నే సినిమాలో ప్రేక్షకులు చూశారని దర్శకుడు చెప్పారు. అలానే క్లైమాక్స్ లో సంకల్పం దృశ్యం, రకరకాల భావాలతో ఏకథాటిగా నాలుగు పేజీల ఏక పాత్రాభినయం, అష్టావధానం సన్నివేశాలను చిత్రీకరించామని కృష్ణవంశీ తెలిపారు. ఓవైపు మృత్యువుకు దగ్గరగా ఉన్నాననే నిజాన్ని మురారి జీర్ణించుకోవాలి, మరోవైపు శబరిని కుటుంబ సభ్యులను ఓదార్చాలి, ఇంకోవైపు ప్రేయసి వసుంధర డేంజర్ లో ఉందనే ఆందోళన చూపించాలి, ఏదో బోధనలు చేస్తున్నట్లు కాకుండా అందరిలో ధైర్యం నింపేలా మాట్లాడాలి.. ఇదంతా చాలా ఎంగేజింగ్ గా చెప్పాలి. ఈ సన్నివేశం నటుడిగా మహేష్ బాబుకి, దర్శకుడిగా తనకు అతి పెద్ద ఛాలెంజ్ అని కృష్ణవంశీ తెలిపారు. ఆ సీన్ లో మహేష్ ఇరగదీసేశాడు, దుమ్మురేపాడు.. హ్యాట్సాఫ్ అని కొనియాడారు. 'మురారి' సినిమాకి సి. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. దివంగత కృష్ణ దగ్గర చాలా దశాబ్దాల పాటు పర్సనల్ మేకప్ మ్యాన్ గా పనిచేసిన సి.మాధవరావు కుమారుడే డీఓపీ రాంప్రసాద్ అని కృష్ణవంశీ తెలిపారు. అమెరికాలో సినిమాటోగ్రఫీ కోర్స్ చేసి ఒక సినిమాకి వర్క్ చేసిన రాంప్రసాద్.. ఆ సినిమాలోని పాటలు చూపించాడని, అవి తనకు నచ్చడంతో 'మురారి' మూవీలో చేరాడని చెప్పారు. ''కొంచెం కష్టమైన సినిమా.. అంతమంది నటీనటులు, అంతా రంగులమయం.. ఫ్రేమింగ్ లు, అందరినీ అన్నింటినీ మ్యాచ్ చేస్తూ సరైన కాంతివంతంగా అమరుస్తూ.. నాలాంటి పిచ్చోడ్ని తట్టుకుంటూ 6 నెలల పాటు రోజుకు 12 నుంచి 15 గంటలు నిర్విరామంగా కష్టపడుతూ బ్రహ్మాండమైన క్వాలిటీ ఇచ్చాడు.. మీరు చూస్తున్న ఆ వైభవం అంతా అతడే.. మనందరి తరపునా శుభాభినందనలు.. థాంక్యూ సోమచ్ రామ్'' అని కృష్ణవంశీ రాసుకొచ్చారు. 'మురారి' సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ శ్రీ వేగేశ్న శ్రీనివాసరాజు చేసిన వర్క్ నీవు కృష్ణవంశీ ప్రశంసించారు. ''మురారి ఇల్లు, వసుంధర ఇల్లు, శంషాబాద్ రామాలయాన్ని అమ్మవారి దేవాలయంగా పునః వ్యవస్థీకరణ చేశారు. అమ్మవారి గర్భాలయం, అమ్మవారి పంచలోహవిగ్రహం, కేరళలో 'చెప్పమ్మా చెప్పమ్మా' పాటకి కొబ్బరి తోటల్లో ముగ్గులు.. సినిమా ఆసాంతం తెలుగు సాంస్కృతిక వైభవానికి వెనుక ఉన్న శక్తి కళా దర్శకుడు శ్రీ వేగేశ్న శ్రీనివాసరాజు. నీలిరంగు రక్తం ఫ్రమ్ భీమవరం. తెలుగు సంస్కృతి, మన పండుగలు, మన పెళ్ళిళ్ళు, మన వైభవంలో నిష్ణాతులు. భలే సరదా మనిషి. అందరికీ అత్యంత ఇష్టుడు. మేము ఇద్దరం 'సిందూరం', 'అంతఃపురం', 'మురారి', 'చందమామ', 'మహాత్మ' సినిమాలు చేశాం. నాకు చాలా ఇష్టమైన మిత్రుడు. ఆయన ఎక్స్ లెంట్ స్కిల్స్ కి థ్యాంక్స్'' అని కృష్ణవంశీ పేర్కొన్నారు. దేవుడితో డీలింగ్ అని ఎప్పుడైనా భయమేసిందా? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ''పూర్తిగా దైవారాధనలోనే ఉన్నాను. చాలా దేవాలయాలలో సినిమా పేరు మీద, మహేష్ పేరు మీద, నా పేరు మీద, నిర్మాత రామలింగేశ్వరరావు పేరు మీద.. మొదలు నుంచి విడుదల వరకు నిరంతరాయంగా ప్రతీరోజూ అర్చన, పూజలు, హోమాలు జరిగాయి. నేను ప్రత్యక్షంగా చాలా హోమాలు చేశాను'' అని కృష్ణవంశీ సమాధానమిచ్చారు. OG సూపర్ స్టార్ కృష్ణ 'మురారి' సినిమా చూసి ఎంత సంబర పడ్డారో, మహేష్ ని మురారిగా చూస్తూ ఎంత గర్వపడుతూ మురిసిపోయారో మాటల్లో చెప్పడం కష్టం. 2001 ఫిబ్రవరి 17న సుదర్శన్ 35mmలో ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తున్నప్పుడు నాకు ఆయన ఇచ్చిన అభినందన ఎంతో మధురం అని చెప్పారు. ''మురారి' మళ్ళీ ఇంకోసారి ఈ డిసెంబర్ 31న మీ ముందుకు వస్తున్న సందర్భంగా.. అసలు ఓ అచ్చ తెలుగు సినిమా 'మురారి' సంభవించడానికి ముఖ్య కారణం అయిన అరుదైన మంచి నిర్మాత నందిగం రామలింగేశ్వరరావుకి.. తెలుగు ప్రేక్షకుల తరపున, గ్లోబల్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల తరపున నా హృదయ పూర్వక కృతజ్ఞతలు'' అని కృష్ణవంశీ ఎక్స్ లో పేర్కొన్నారు.