ఆసక్తికరంగా సాగుతోంది. తొలి రోజే 20 వికెట్లు పడటంతో ఎంసీజీ పిచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. పేస్ బౌలింగ్‌కు బాగా సహకరిస్తుండటంతో అటు ఆసీస్, ఇటు ఇంగ్లండ్ బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 152 పరుగులకే ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా, రెండో ఇన్నింగ్స్‌లో 132 పరుగులకు పది వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగులకే ఇంగ్లండ్ కుప్పకూలడంతో.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లిష్ జట్టు విజయానికి 175 పరుగులు కావాల్సి వచ్చింది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో బౌలర్ల హవా కొనసాగుతోంది. తొలి రోజు మూడో సెషన్‌కే ఇంగ్లండ్ జట్టు ఆలౌట్ అవడంతో.. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఒకే ఒక్క ఓవర్ సాగడంతో ఆసీస్ నైట్ వాచ్‌మన్‌గా స్కాట్ బోలాండ్‌ను దింపింది. అయితే వికెట్లేమీ పడకుండా కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసింది. 4/0 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు ఆరంభంలో దీటుగానే ఎదుర్కొంది. ట్రావిస్ హెడ్ అటాకింగ్ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దాంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటర్లకు అనుకూలిస్తుందని అందరూ అనుకున్నారు. ఆ లోపే వరుస వికెట్లు పడటం మొదలయ్యాయి. హెడ్ మినహా మిగతా టాప్ 4 బ్యాటర్లు సింగిల్ డిజిట్స్‌కే పెవిలియన్ బాట పట్టారు. బోలాండ్ 6, జేక్ వెధరాల్డ్ 5, లబుషేన్ 8 పరుగులకే అవుటవ్వగా.. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ స్మిత్‌తో కలిసి హెడ్ కాసేపు ఇన్నింగ్స్ కొనసాగించాడు. అయితే 67 బంతుల్లో 46 పరుగులు చేసి హెడ్ బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే ఉస్మాన్ ఖ్వాజా డకౌట్ కావడం, క్యారీ కూడా 4 పరుగులకే పెవిలియన్ బాట పట్టడంతో ఆస్ట్రేలియా 88 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. 100 పరుగుల లోపే ఇన్నింగ్స్ క్లోజ్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ గ్రీన్ - స్మిత్ ఏడో వికెట్‌కు 31 పరుగులు జోడించారు. గ్రీన్ అవుటవ్వడంతో.. నేసర్, స్టార్క్, రిచర్డ్‌సన్ వెంటవెంటనే అవుటయ్యారు. కెప్టెన్ స్మిత్ 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 4, స్టోక్స్ 3, జోష్ టంగ్ 2, అట్కిన్‌సన్ ఒక వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ విజయానికి 175 పరుగులు కావడం, ఇంకో రెండు సెషన్‌లు సమయం ఉండటంలో రెండో రోజుకే ఫలితం వస్తుందని అందరూ ఆశిస్తున్నారు.