US Fed Rate Cut: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ దెబ్బకు.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పు కనిపిస్తోంది. ఇప్పటికే .. ఇప్పుడు అదే ఫెడ్ అంచనాలతో అంతకంతకూ ఇంకా పెరుగుతూనే ఉంది. గత వారం రోజులుగా బంగారం, వెండి రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రతి రోజూ సరికొత్త గరిష్ఠాల్నినమోదు చేస్తున్నాయి. ఇప్పుడు కూడా డిసెంబర్ 27న గోల్డ్, సిల్వర్ రేట్లు భారీ స్థాయిలో పెరిగి జీవన కాల గరిష్ఠాల్ని తాకాయి. ఫెడ్ వడ్డీ రేట్లను వచ్చే ఏడాది కూడా తగ్గిస్తుందని సంకేతాలు అందాయి. ఇదే బంగారం, వెండి ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే.. అప్పుడు యూఎస్ డాలర్, బాండ్ ఈల్డ్స్ డిమాండ్ తగ్గి.. ఇదే సమయంలో బంగారం ఆకర్షణీయంగా మారుతుందని చెప్పొచ్చు. దీంతో అటువైపు పెట్టుబడులు పెరుగుతుండటం.. అలాగే బంగారం ధర పెరుగుతుండటం జరుగుతోంది. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ రేట్లు ఎక్కడ ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఇప్పుడు 4,533 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. కిందటి రోజు ఇది 4500 డాలర్ల మార్కు దిగువన ఉంది. సిల్వర్ రేటు చూస్తే చుక్కలు చూపిస్తోంది. ఇది మరింత భారీగా పెరిగి 79.38 డాలర్ల మార్కు వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల ప్రభావం.. దేశీయంగా శనివారం ఉదయం 10 తర్వాత కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం స్థిరంగా ఉంది. ఇప్పుడు మారకం విలువ రూ. 89.93 వద్ద కొనసాగుతోంది. దేశీయంగా బంగారం ధరల్ని చూస్తే.. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ మళ్లీ రూ. 700 పెరగ్గా 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులం రూ. 1,28,350 వద్ద ఉంది. అంతకుముందు కూడా వరుసగా రూ. 300, రూ. 350, రూ. 2200, 1800 చొప్పున పెరిగాయి. ఇక 24 క్యారెట్ల పసిడి ధర ప్రస్తుతం 10 గ్రాములపై రూ. 770 పెరిగి రూ. 1,40,020 వద్ద కొనసాగుతోంది. ఇవి ఆల్ టైమ్ గరిష్ఠ ధరలు కావడం గమనార్హం.ఇంకా బంగారం ధరలకు మించి వెండి రేటు పెరుగుతోంది. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఒక్కరోజులోనే ఏకంగా రూ. 9 వేలు పెరగడంతో కేజీకి ప్రస్తుతం రూ. 2.54 లక్షల మార్కు వద్ద ఉంది. ఉదయం 10 గంటల తర్వాత ఇది మరింత పెరుగుతుందని చెప్పొచ్చు. గోల్డ్, సిల్వర్ ధరలు అన్ని చోట్లా ఒకేలా ఉండవు. ప్రాంతాల్ని బట్టి.. స్థానిక పన్ను రేట్లను బట్టి ధరల్లో తేడా గమనించొచ్చు.