ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే, నియమాలు పాటించకపోతే చలాన్ విధిస్తారు. అయితే చాలా మంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. లెక్కలోకి కూడా తీసుకోరు. ఎప్పుడైనా డిస్కౌంట్ ఇస్తే, అప్పుడు కడదామని భావించేవారు ఎందరో. ఇక రాజకీయ నేతలైతే అసలు వాటి గురించే పట్టించుకోరు. చలాన్ చెల్లించడం సిగ్గుచేటు అనుకుంటారు. చలాన్ల విషయంలో దేశంలో ఎక్కడైనా ఇలానే జరుగుతుంది. కానీ మహారాష్ట్రలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. వాహనదారులు చలాన్ చెల్లించడానికి వచ్చి క్యూ లైన్‌లో నిల్చుంటున్నారు. వేల రూపాయలు కాదు కదా.. లక్షకు పైగా సరే.. ఒక్కసారే ఆ మొత్తం చెల్లిస్తున్నారు. మరి వారిలో ఈ ఆకస్మిక మార్పుకు కారణం ఏంటి అంటే ఎన్నికల సంఘం పెట్టిన రూల్. నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే, వాహనాలపై పెండింగ్‌లో చలాన్లు ఉంటే నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయని ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. అంటే ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమపై ఎలాంటి ప్రభుత్వ బకాయిలు లేవని ధృవీకరించే సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఈ జాబితాలో అనధికార నిర్మాణాలకు సంబంధించిన పెనాల్టీలు, పన్నులు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన జరిమానాలు కూడా ఇందులో ఉన్నాయి.ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వాహనాలపై ఉన్న ఈ-చలాన్ జరిమానాలను చెల్లించారా లేదా అని ఎన్నికల అధికారులు పరిశీలిస్తారు. అభ్యంతరాల నిరాకరణ పత్రం (No Objection Certificate - NOC) లేకపోతే, నామినేషన్ ఫారాలు అనర్హతకు గురయ్యే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం తీసుకువచ్చిన ఈ నిబంధన కారణంగా, అభ్యర్థులు పెండింగ్‌లో ఉన్న ఫైన్లను చెల్లించడానికి పరుగులు తీస్తున్నారు. గత కొద్ది రోజులుగా చాలా మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ప్రభావితం కాకుండా చూసుకోవడానికి థానే ట్రాఫిక్ విభాగాన్ని సందర్శించి, పెండింగ్‌లో ఉన్న ఈ-చలాన్లను చెల్లిస్తున్నారని అధికారులు తెలిపారు.మంగళవారం, ఒక అభ్యర్థి తన అభ్యర్థిత్వాన్ని కాపాడుకోవడానికి రూ.1.5 లక్షల ట్రాఫిక్ ఫైన్లను చెల్లించినట్లు సమాచారం. ఈ-చలాన్ అంటే ఎలక్ట్రానిక్ చలాన్, అంటే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు విధించే జరిమానాను ఆన్‌లైన్‌లో చెల్లించడం. ఈ ప్రక్రియ వల్ల అభ్యర్థులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారా లేదా అని తెలుసుకోవచ్చు.చలాన్ల చెల్లింపు కోసం ఠాణె ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఈ-చలాన్ల చెల్లింపునకు ప్రత్యేక కౌంటరు ఏర్పాటుతోపాటు ఆన్‌లైన్‌ పేమెంటు సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చినట్లు డీసీపీ పంకజ్ శిరసాట్ తెలిపారు.