తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అనుమతిస్తోంది. ఈ పది రోజులూ చాలా పవిత్రమైనవని.. ఏ రోజు దర్శనం చేసుకున్నా ఒకే రకమైన ఫలితం ఉంటుందన్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు పొందిన భక్తులు నిర్దేశిత సమయానికి తిరుమలకు చేరుకుంటే, వారిని రెండు గంటల్లోనే చేయిస్తామని. ఇందుకోసం మూడు ప్రవేశ మార్గాలను సిద్ధం చేశామని, కేటాయించిన సమయానికి వచ్చే భక్తులను క్యూలైన్‌కు దగ్గరగా ఉన్న మార్గంలో పంపుతామని తెలిపారు. సమయానికి ముందే వచ్చేవారిని మరో రెండు మార్గాల గుండా క్యూలైన్‌లోకి తీసుకుని, వారికి కేటాయించిన సమయంలోనే దర్శనం చేయిస్తామని వివరించారు. మొత్తం ఈ పది రోజుల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కలిపి 7,70,000 మందికి దర్శనం కల్పిస్తామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా రద్దీని అంచనా వేయడానికి, భక్తులకు మెరుగైన సమాచారం అందిస్తామన్నారు ఈవో. ప్రతి రెండు గంటలకు ఒకసారి రద్దీపై కచ్చితమైన సమాచారం ఇస్తామన్నారు. సర్వదర్శనం భక్తులు రద్దీ తక్కువగా ఉన్న సమయంలో వచ్చి ఇబ్బందులు పడకుండా స్వామివారిని దర్శించుకోవచ్చన్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు సౌకర్యవంతంగా దర్శనం చేసుకోవచ్చన్నారు. ఈ పది రోజుల కాలంలో, మొత్తం 182 గంటల్లో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయించామని గుర్తు చేశారు. మిగిలిన సమయం మాత్రమే వీఐపీలు, వీవీఐపీలకు కేటాయించామన్నారు. ఈ పది రోజుల్లో ప్రివిలేజ్ దర్శనాలు, బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దుచేసి.. నేరుగా వచ్చే ప్రముఖులకు మాత్రమే దర్శనం కల్పించామన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ కేంద్రంలో భక్తులకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ సుమారు 16 రకాల అన్నప్రసాదాలు, పానీయాలను సిద్ధం చేస్తున్నారు. భక్తుల వసతి కోసం కూడా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరుమలలో భద్రతను పటిష్టం చేయడానికి పోలీసు విభాగం నుంచి 2400 మందిని, తితిదే విజిలెన్స్‌ నుంచి 1100 మందిని నియమించారు. భక్తులకు దర్శనం సులభతరం చేయడానికి అవసరమైన ఏర్పాట్ల గురించి ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృతంగా తెలియజేయనున్నారు. తితిదేకు అనుబంధంగా ఉన్న ఆరు లక్షల మంది శ్రీవారి సేవకుల సహాయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని ఈవో తెలిపారు. భక్తులు టోకెన్లలోనే పేర్కొన్న సమయానికే తిరుమలకు రావాలని టీటీడీ ఈవో కోరారు.