Boxing Day Test: మెల్‌బోర్న్ పిచ్‌పై విమర్శలు.. ఒకే రోజు 20 వికెట్లు పడటమేంటీ!

Wait 5 sec.

యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ (ఎంసీజీ)లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు తొలి రోజే తీవ్ర చర్చకు దారితీసింది. ఒక్క రోజులోనే 20 వికెట్లు పడిపోవడంతో, పిచ్ స్వభావంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ , ఎంసీజీ పిచ్‌ను తీవ్రంగా తప్పుబట్టాడు.శుక్రవారం జరిగిన తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ బౌలర్లు ఆస్ట్రేలియాను 152 పరుగులకే కట్టడి చేశారు. జోష్ టంగ్ ఐదు వికెట్లతో రాణించాడు. అయితే, అదే పిచ్‌పై బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు కేవలం 110 పరుగులకే ఆలౌట్ అయింది. మైఖేల్ నేసర్, స్కాట్ బోలాండ్ కలిసి ఏడు వికెట్లు తీసి ఇంగ్లండ్ ఆశలను దెబ్బతీశారు. ఫలితంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల ఆధిక్యం సాధించింది. ఓ స్పోర్ట్స్ వేదికపై జరిగిన చర్చలో పాల్గొన్న అలిస్టర్ కుక్ ఎంసీజీ పిచ్‌పై స్పందించాడు. “ఇది మంచి టెస్ట్ పిచ్ కాదు. రెండు, మూడు, నాలుగో రోజు పిచ్ సద్దుమణగకపోతే, ఇది పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా తయారైన వికెట్. బౌలర్లు వికెట్లు తీయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు” అని కుక్ పేర్కొన్నాడు.బ్యాటర్లు విఫలమయ్యారని విమర్శించవచ్చని అంగీకరించినప్పటికీ, పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయని కూడా కుక్ స్పష్టం చేశాడు. “రెండు జట్ల బ్యాటింగ్‌లో లోపాలు ఉన్నాయి. కానీ సరైన లెంగ్త్‌లో బంతి వేస్తే, అది రెండు వైపులా మూవ్ అవుతోంది. ఇది కొంత అన్యాయమే” అని అన్నాడు. అయితే కుక్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌ను ప్రత్యేకంగా ప్రశంసించాడు. ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లపై అతను చూపించిన నియంత్రణ అసాధారణమని అన్నాడు. “బోలాండ్‌ను చూస్తూ ‘ఇతన్నెలా ఎదుర్కోవాలి?’ అనిపించింది. రౌండ్ ద వికెట్ నుంచి స్టంప్స్‌పై దాడి చేస్తూ కొన్ని బంతులు లోపలికి, కొన్ని బయటికి బాగా కదులుతున్నాయి. కుడిచేతి బ్యాటర్లకు కూడా ఆడటానికి మార్గం కనిపించడం లేదు” అని కుక్ వ్యాఖ్యానించాడు.పిచ్ రెండో రోజు కొంత మెరుగుపడవచ్చని ఆశించినప్పటికీ, గ్రౌండ్స్‌మన్ నుంచి వచ్చిన సమాచారం ఆందోళన కలిగించిందని కుక్ వెల్లడించాడు. “పిచ్ రేపు సద్దుమణగొచ్చని ఆశిస్తున్నాను. కానీ గ్రౌండ్స్‌మన్ మాత్రం అలా జరుగుతుందని అనుకోవడం లేదని చెప్పారు” అని తెలిపాడు.