ఏపీలోని రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ ఓ శుభవార్త వినిపించింది. గుంతకల్లు - మార్కాపురం డైలీ ప్యాసింజర్ రైలుపై కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ విషయంలో చేసిన విజ్ఞప్తిని తాము పరిగణలోకి తీసుకుంటున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో నంద్యాలలో రైల్వే సేవల విషయంపై మాట్లాడారు. నంద్యాల జిల్లాలో రైల్వే సేవలను మరింత మెరుగుపరచాలని కోరిన శబరి.. నంద్యాల మీదుగా గుంతకల్లుకు పగటి పూట మెమో లేదా ప్యాసింజర్ రైలును నడపాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. ఈ నేపథ్యంలో బైరెడ్డి శబరి వినతిపై రైల్వే శాఖ స్పందించింది. గుంతకల్లు - మార్కాపురం డైలీ ప్యాసింజర్ రైలు ప్రవేశపెట్టే ప్రతిపాదన తమ వద్ద పరిశీలనలో ఉందని వెల్లడించింది. దీంతో ఈ ప్రాంతవాసుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.మరోవైపు నంద్యాల నుంచి గుంతకల్లుకు పగటి సమయంలో రైళ్లు నడపాలని గత కొంతకాలంగా స్థానికులు కోరుతున్నారు. బేతంచెర్ల మీదుగా దుపాడు వరకూ కొత్తగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ఎంపీ బైరెడ్డి శబరి గతంలో కేంద్రాన్ని కోరారు. ఈ సందర్భంగా నంద్యాలలో నడిచే రైళ్ల వివరాలను ఆమె వెల్లడించారు. నంద్యాల నుంచి గుంతకల్లుకు వెళ్లే నాలుగు రైళ్లూ కూడా రాత్రి పూట మాత్రమే అందుబాటులో ఉన్నాయని.. అది కూడా పూర్తిగా అర్ధరాత్రి సమయంలో ఉన్నాయని శబరి వివరించారు.దీంతో ఈ మార్గంలో రోజువారీ ప్రయాణాలు చేసే విద్యార్థులు, ఉద్యోగులు, రైలు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని బైరెడ్డి శబరి రైల్వే శాఖ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని నంద్యాల మీదుగా గుంతకల్లుకు పగటి పూట ప్యాసింజర్ రైలును నడపాలని కోరారు. రోజువారీ మెమో రైలు లేదా ప్యాసింజర్ రైలును అందుబాటులోకి తేవాలని గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఎంపీ బైరెడ్డి శబరి కోరారు. దీనిపట్ల రైల్వే మంత్రి అప్పట్లో సానుకూలంగా స్పందించారు. తాజాగా ఎంపీ వినతిపై స్పందించిన రైల్వే శాఖ.. నంద్యాల మీదుగా గుంతకల్లు నుంచి మార్కాపురం వరకూ డైలీ ప్యాసింజర్ రైలు నడిపే ప్రతిపాదన తమ వద్ద ఉందని వెల్లడించింది.