హైదరాబాద్-విజయవాడ హైవేపై.. ఆ ప్రదేశంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్..

Wait 5 sec.

హైదరాబాద్ - విజయవాడ పై తరచూ జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా హయత్‌నగర్ పరిధిలోని భాగ్యలత , లెక్చరర్స్ కాలనీ ప్రాంతాల్లో పాదచారులు రోడ్డు దాటడం అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర రోడ్లు , భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.భాగ్యలత కూడలి వద్ద పాదచారుల పైవంతెన (Foot Over Bridge) నిర్మాణాన్ని వచ్చే మూడు నెలల్లో పూర్తి చేయాలని మంత్రి డెడ్‌లైన్ విధించారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, వంతెన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. గత కొంతకాలంగా స్థానిక నివాసితులు, విద్యార్థులు ఇక్కడ వంతెన కావాలని నిరసనలు తెలుపుతున్నారు. ఈ నిరసనలకు స్పందించిన ప్రభుత్వం నిధుల విడుదలకు, పనుల వేగానికి మొగ్గు చూపింది. హయత్‌నగర్ ప్రాంతంలో కొన్ని ప్రైవేటు ఆస్తుల యజమానులు అడ్డుపడుతుండటంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు యజమానులు తమ భూములను ఇచ్చేందుకు నిరాకరిస్తూ కోర్టు నుంచి స్టే తీసుకురావడంతో రోడ్డు వెడల్పు పనులు నిలిచిపోయాయి. ‘ప్రజల ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోం’ అని మంత్రి స్పష్టం చేశారు. అవసరమైతే పోలీసు బందోబస్తు మధ్య పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చట్టపరమైన చిక్కులను అధిగమించి ప్రజా భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. హయత్‌నగర్ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందడంతో ఇక్కడ వాహనాల రద్దీతో పాటు పాదచారుల సంఖ్య కూడా పెరిగింది. ఇక్కడ చాలా వేగంగా ప్రయాణిస్తుంటాయి. సిగ్నల్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో రోడ్డు దాటే వారు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో అనేక విద్యాసంస్థలు ఉండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని రోడ్డు దాటాల్సి వస్తోంది. కేవలం పైవంతెనలే కాకుండా, రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు కూడా అత్యవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పనులన్నీ పూర్తయితేనే ఎన్‌హెచ్‌ 65పై మృత్యుఘోషకు అడ్డుకట్ట పడుతుంది.