కొత్తగా గెలిచిన సర్పంచ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. రూ.10 లక్షలు ప్రకటన

Wait 5 sec.

రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వారికి అభినందనలు తెలియజేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లను సన్మానించిన సీఎం రేవంత్.. గ్రామాల అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ఏడాదిలో గ్రామాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులను రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మంజూరు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల నుంచి వచ్చే నిధులకు అదనంగా ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. పంచాయతీలకు సాధారణంగా అందే నిధులు కాకుండా.. ముఖ్యమంత్రి నిధి నుంచి స్పెషల్ డెవలప్‌మెంట్ నిధులను కేటాయిస్తామని ప్రకటించారు. అయితే చిన్న గ్రామాలకు ఒక్కొక్కదానికి రూ.5 లక్షలు.. పెద్ద పెద్ద గ్రామాలకు ఒక్కో దానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ నిధులకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో ఎలాంటి సంబంధం లేకుండా మంజూరు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు సీఎం కీలక సూచనలు చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని హితవు పలికారు. దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను పరిష్కించేందుకు ఈ ప్రత్యేక అభివృద్ధి నిధులను ఉపయోగించాలని పేర్కొన్నారు. గ్రామాలే భారతదేశానికి పునాదులు ఉన్నాయని మహాత్మా గాంధీ చెప్పారని గుర్తు చేసిన సీఎం రేవంత్.. గ్రామాలు డెవలప్ అయినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాలు అందినప్పుడే నిజమైన పాలన అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ప్రతీ గ్రామం, తండాకు రోడ్లను వేస్తామని.. గ్రామ ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సర్పంచ్‌లు ప్రజా సేవలో నిమగ్నం కావాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లను పార్టీలు చూడకుండా గ్రామాలను అభివృద్ధి చేయాలని.. ఇతర పార్టీ నుంచి గెలిచారనే వివక్ష ఎక్కడా ఉండొద్దని తేల్చి చెప్పారు. చిన్న చిన్న విభేధాలు, సమస్యలు ఉంటే వాటన్నింటినీ పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని తెలిపారు.