ఒక్కరోజే 66 శాతం పడిపోయిన షేరు.. రాత్రికి రాత్రే ఏం జరిగింది.. ఇన్వెస్టర్లలో టెన్షన్ టెన్షన్!

Wait 5 sec.

: విదేశీ మదుపరులు పెద్ద మొత్తంలో దేశీయంగా పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటుండటం, గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణకు పాల్పడుతుండటం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతూనే ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఇలా పలు హెవీ వెయిట్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడితో సూచీలు పతనం అవుతున్నాయి. ఫార్మా, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో అమ్మకాలు ఎక్కువ జరిగాయి. దీంతో బుధవారం సెషన్‌లో దేశీయ సూచీలు నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 116 పాయింట్ల పతనంతో 85,408 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ చూస్తే 35 పాయింట్లు తగ్గి 26,142 వద్ద సెషన్ ముగించింది.ఇదంతా బానే ఉన్నా.. ఒక స్టాక్ మాత్రం భారీగా పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్లు తెగ ఆందోళన చెందారు. అదే మల్టీబ్యాగర్ స్మాల్ క్యాప్ స్టాక్.. జీఆర్ఎం ఓవర్సీస్ లిమిటెడ్. మంగళవారం సెషన్‌లో చూస్తే ఈ స్టాక్ ధర రూ. 505 వద్ద ముగియగా.. ఇవాళ నేరుగా 66 శాతం పతనంతో రూ. 171.25 వద్ద ఓపెన్ అయింది. అయితే ఇక్కడ మళ్లీ అప్పర్ సర్క్యూట్ కొట్టి రూ. 185.45 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసినా.. మళ్లీ వెనక్కి తగ్గింది. చివరికి 1.70 శాతం నష్టంతో రూ. 165.65 వద్ద సెషన్ ముగించింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 1.02 వేల కోట్లుగా ఉంది. అయితే ఒక్కసారిగా రూ. 500 స్థాయిలో ఉన్న స్టాక్ ధర రూ. 200 లోపు దిగిరావడంతో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారు.. ఇతర మదుపరులు.. ఆందోళన చెందారు. ఒక్కసారిగా ఏం జరిగిందో ఆర్థం కాలేదు. ఇక్కడ స్టాక్ ధర తగ్గిన మాట నిజమే కానీ.. ఇది ఇన్వెస్టర్‌పై ఎలాంటి ప్రభావం నేరుగా చూపదు. ఇటీవల ఈ కంపెనీ 2:1 రేషియోలో బోనస్ షేర్లను ప్రకటించగా.. డిసెంబర్ 24 అంటే బుధవారమే దీనికి రికార్డు డేట్‌గా నిర్ణయించింది. ఈ క్రమంలోనే షేర్ ఎక్స్ బోనస్ అయింది. ఇక్కడ ఇన్వెస్టర్ తమ దగ్గర ఉన్న ఒక్కో ఈక్విటీ షేరుకు అదనంగా 2 షేర్ల చొప్పున పొందుతాడన్నమాట. అంటే 100 షేర్లు ఉన్న వారికి 200 షేర్లు అదనంగా వస్తాయి. ఇలా షేర్ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగానే షేర్ ధర తగ్గుతుంది. కానీ ఇన్వెస్టర్ పెట్టుబడిపై మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదు. బుధవారం సెషన్ ముగిసేలోపు షేర్ హోల్డర్లకు అదనంగా షేర్లు డీమ్యాట్ అకౌంట్లో జమవుతాయి. కాబట్టి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇలాగే స్టాక్ స్ప్లిట్‌ సమయంలోనూ షేర్ ధర తగ్గుతుంటుంది.