నిరుద్యోగ భారతం.. 187 హోంగార్డు ఉద్యోగాలకు వేలాదిగా వచ్చిన అభ్యర్థులు

Wait 5 sec.

ఒడిశాలో ఇంత భారీ సంఖ్యలో వచ్చిన నిరుద్యోగులకు పరీక్ష నిర్వహించడం.. ఎయిర్‌స్ట్రిప్ రన్‌వేను పరీక్షా కేంద్రంగా మార్చేశారు. 5వ తరగతి అర్హత ఉన్న ఈ ఉద్యోగాల కోసం బీటెక్, ఎంబీఏలు చదివిన వారు కూడా రన్‌వేపై కూర్చుని పరీక్ష రాయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సంబల్‌పూర్ జిల్లాలోని 24 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఖాళీగా ఉన్న 187 హోంగార్డు పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. సుమారు 10 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. పరీక్ష రోజున 8 వేల మందికి పైగా హాజరయ్యారు. సంబల్‌పూర్ జిల్లా కేంద్రంలో 20 పాఠశాలల్లో పరీక్ష పెడితే.. అభ్యర్థుల రద్దీని మేనేజ్ చేయడం కష్టమని అధికారులు భావించారు. దీంతో ఎయిర్‌స్ట్రిప్ అయితే అందరినీ ఒకే చోట నియంత్రించవచ్చని ఎస్పీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక అభ్యర్థులందరినీ జమాదర్‌పాలి ఎయిర్‌స్ట్రిప్ రన్ వేపై వరుసగా కూర్చోబెట్టిన పోలీసు అధికారులు.. డ్రోన్ల ద్వారా వారిని పర్యవేక్షించారు. ఇక పరీక్ష సమయం 90 నిమిషాలు కాగా.. గరిష్ఠ మార్కులు 50గా నిర్ణయించారు. మరోవైపు.. ఈ హోంగార్డు ఉద్యోగాలకు కేవలం 5వ తరగతి ఉత్తీర్ణులై ఉంటే చాలు. కానీ అక్కడి వచ్చిన అభ్యర్థులు అంతా ఎక్కువ మంది.. డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు, బీటెక్‍‌, ఎం‌టెక్, ఎంబీఏ, ఎంసీఏ చదివిన వారే ఉండటం గమనార్హం. ఇలాంటి ఉన్నత విద్యావంతులు కూడా రోజువారీ వేతనంపై పనిచేసే ఈ హోంగార్డ్ ఉద్యోగం కోసం పోటీ పడటంతో.. దేశవ్యాప్తంగా పెరుగుతున్న నిరుద్యోగం సమస్యను ఎత్తిచూపుతోంది.ఒడిశాలో హోంగార్డులకు రోజుకు సుమారు రూ.612 వేతనం అందుతుంది. ఇది కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉన్నప్పటికీ.. ప్రైవేట్ రంగంలో సరైన అవకాశాలు లేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగం ద్వారా లభించే సామాజిక భద్రత కారణంగానే నిరుద్యోగ యువత ఇలాంటి పోస్టులకు కూడా భారీగా తరలివస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.