హర్యానా ప్రభుత్వం షాపులు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పనివేళలను మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై ఆ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. సోమవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో హర్యానా షాపులు మరియు వాణిజ్య సంస్థల (సవరణ) బిల్లు-2025ను ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం.. ప్రైవేటు సంస్థలు, దుకాణాల్లో పనిచేసే ఉద్యోగుల రోజు వారీ పనివేళలను 9 గంటల నుంచి 10 గంటలకు పెంచారు. అయితే.. వారం మొత్తంగా గరిష్ట పనివేళలు మాత్రం ఇప్పుడు ఉన్న 48 గంటలే కొనసాగుతాయని హర్యానా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కొత్త బిల్లుపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఆధునిక కాలంలో బానిసత్వాన్ని తీసుకొచ్చారని విమర్శిస్తున్నాయి.ఈ కొత్త సవరణ చట్టం ప్రకారం.. రోజువారీ పని సమయం 9 నుంచి 10 గంటలకు పెరిగింది. ఒక త్రైమాసికంలో ఓవర్ టైమ్ పరిమితిని 50 గంటల నుంచి ఏకంగా 156 గంటలకు పెంచారు. గతంలో ప్రతి 5 గంటల పని తర్వాత విరామం ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పుడు దాన్ని 6 గంటలకు పొడిగించారు. అంటే ఉద్యోగులు నాన్‌స్టాప్‌గా 6 గంటల పాటు పని చేయాల్సి ఉంటుంది. 20 కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్న చిన్న చిన్న దుకాణాలు, హోటళ్లు, సెలూన్లకు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపును కల్పించారు. ఇక నుంచి వారు కేవలం ఆన్‌లైన్‌లో సమాచారం ఇస్తే సరిపోతుంది.ఆధునిక బానిసత్వం అంటూ విపక్షాల మండిపాటుకాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదిత్య సూర్జేవాలా ఈ కొత్త బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. దీన్ని ఆధునిక బానిసత్వంగా ఆయన అభివర్ణించారు. ఈ చట్టం వల్ల ఒక ఉద్యోగి రోజుకు 10 గంటల సాధారణ పని, 2 గంటల ఓవర్ టైమ్ కలిపి మొత్తం 12 గంటల పాటు గొడ్డు చాకిరీ చేయాల్సి వస్తుందని మండిపడ్డారు. రోజులో 12 గంటలు కష్టపడి పనిచేసిన వ్యక్తి.. ఇంటికి వెళ్లిన తన పిల్లలకు పాఠాలు ఎలా నేర్పిస్తాడని ప్రశ్నించారు. అంతేకాకుండా వృద్ధులైన తల్లిదండ్రులను ఎలా చూసుకుంటాడని నిలదీశారు. వీటన్నింటినీ పక్కనపెడితే.. విరామం లేకుండా 6 గంటల పాటు నిలబడి పని చేయడం ఉద్యోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.హర్యానా ప్రభుత్వం వివరణఈ బిల్లును సమర్థిస్తూ హర్యానా కార్మిక శాఖ మంత్రి అనిల్ విజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కొత్త చట్టం అటు వ్యాపారులతోపాటు.. ఇటు కార్మికులకు ఇద్దరికీ ప్రయోజనకరమని పేర్కొన్నారు. పండగ సీజన్లు లేదా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయంలో వ్యాపారాలకు వెసులుబాటు కల్పించేందుకే ఈ మార్పులు చేసినట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కూడా 10 గంటల పనివేళలు ఉన్నాయని అనిల్ విజ్ గుర్తు చేశారు. ఓవర్ టైమ్ పరిమితి పెంచడం వల్ల కార్మికులు అదనంగా సంపాదించుకునే అవకాశం ఉంటుందని మంత్రి వెల్లడించారు.