గతంలో అంతగా ఆదరించకపోయినా.. ఈ ఏడాది మాత్రం క్రేజ్ పెరిగింది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ప్లేయర్లు ఇందులో ఆడుతుండటమే కారణం. స్టార్లతో ఈసారి ఈ డొమెస్టిక్ ట్రోఫీకి కళ సంతరించుకుంది. టీమిండియా ప్లేయర్లు కనీసం రెండు డొమొస్టిక్ మ్యాచ్‌లు ఆడాలని కండిషన్ పెట్టడం కూడా మరో కారణం. కోహ్లి, రోహిత్ వంటి ప్లేయర్లు పాల్గొంటుండడంతో.. ప్రారంభానికి ముందే ఈ టోర్నమెంట్‌పై అంచనాలు పెరిగిపోయాయి. బుధవారం (డిసెంబర్ 24) రోహిత్, కోహ్లి వంటి స్టార్లతో పాటు మొత్తంగా ఒక్కరోజులోనే విజయ్ హజారే ట్రోఫీలో 22 సెంచరీలు నమోదు కావడం గమనార్హం. దీంతో ఈ ట్రోఫీపై క్రేజ్ మరింత పెరిగింది. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌ల లైవ్ ప్రసారం చేయకపోవడంతో.. బీసీసీఐపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ను బ్రాడ్‌కాస్ట్ చేయకపోవడంతో క్రికెట్ అభిమానులు ఫ్రస్టేషన్, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. తమ ఫేవరెట్ క్రికెటర్ల ప్రదర్శన చూడాలని అభిమానుల్లో ఉన్న కోపం అర్థం చేసుకోగలం అని అన్నాడు. అదే విధంగా ఇంత పెద్ద ట్రోఫీ నిర్వహించడంలో బీసీసీఐ పడుతున్న లాజిస్టికల్ ఇబ్బందులను కూడా గుర్తించాలని అభిమానులకు సూచించాడు. “(విజయ్ హజారే ట్రోఫీ లైవ్ ఇవ్వకపోవడం) ఇదేం విడ్డూరం అని అభిమానులు అడుగుతున్నారు? ఈ మ్యాచ్‌లను కేవలం ఎలాన్ మస్క్ మాత్రమే ఎక్స్‌లో ప్రసారం చేయగలడు” అని అశ్విన్ నవ్వుతూ అన్నాడు. “రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఫాలో అవ్వాలని అందరూ అనుకుంటారు. అందులో సందేహం లేదు. అంతేకాకుండా వారు అద్భుతమైన సిరీస్ ఆడారు. త్వరలో న్యూజిలాండ్‌తో తలపడనున్నారు. ఇక విజయ్ హజారే ట్రోఫీలోనూ వారిద్దరూ అద్భుతంగా రాణించారు. ఒకరు 155, మరొకరు 131 పరుగులు చేశారు. ఇద్దరూ నమ్మశక్యం కాని స్ట్రైక్ రేట్లతో ప్రదర్శన చేశారు. ఇలాంటి ఆటగాళ్లు వచ్చి ఆడినప్పుడు, మ్యాచ్‌లు మరింత ఉత్సాహంగా మారతాయి.” అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.ఎందుకు బ్రాడ్‌కాస్ట్ చేయడం లేదు..?"రోహిత్, కోహ్లి ఆటతీరును అందరూ చూడాలనుకుంటున్నారు. అయితే ఈ ట్రోఫీలో వీరిద్దరూ పాల్గొంటారు అనే సమాచారం ఎప్పుడు వచ్చిందో మనం అర్థం చేసుకోవాలి. అంతర్జాతీయ క్యాలెండర్ ఇచ్చినప్పుడు, దేశీయ క్యాలెండర్‌ను కూడా అప్పుడే ఇస్తారు. ఇలా క్యాలెండర్ సెట్ చేసిన తర్వాత.. ఏయే వేదికలను కవర్ చేయడం సులభం, ఏ మ్యాచ్‌లను లైవ్ ప్రసారం చేయవచ్చో BCCI, బ్రాడ్‌కాస్టర్లు కలిసి నిర్ణయిస్తారు. చివరి నిమిషంలో మార్పులు చాలా అరుదుగా సాధ్యమవుతాయి. ఇక ఈ ట్రోఫీలో రోహిత్, కోహ్లి ఆడతారని చివరి నిమిషంలో తెలిసింది. అంతేకాకుండా, భారత్‌లో అత్యధిక ఫస్ట్-క్లాస్ జట్లు ఉన్నాయి. అన్ని మ్యాచ్‌లను ప్రసారం చేయడం సాధ్యం కాదు. అభిమానుల నిరాశను అర్థం చేసుకోగలను. కానీ ఈ విషయంలో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి" అని అశ్విన్ వివరించాడు.