అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో () అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా.. రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అంతరిక్షయానానికి ముందు తన రెండు జ్ఞానదంతాలను తొలగించుకున్నట్లు శుక్లా తెలిపారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై వ్యోమగాములకు అవగాహన ఉన్నప్పటికీ.. వ్యోమనౌకలో దంతాలకు సంబంధించిన ఏదైనా సమస్య తలెత్తితే సర్జరీ చేయలేరని చెప్పారు. అందుకే ముందుగానే వీటిని తొలగించుకోవాల్సి వస్తుందని వివరించారు.ఐఐటీ బాంబేలో బుధవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో శుభాన్షు శుక్లా మాట్లాడుతూ... ‘‘దంతాల ఆరోగ్యం చాలా ముఖ్యమైంది. అంతరిక్షయానం కోసం ఎంపిక సమయంలో చాలా మంది (ఆసక్తికలిగిన వ్యోమగాములు) తమ దంతాలను తొలగించారు. శిక్షణా సమయంలోనే వీటిని తీసేస్తారు.. అంతరిక్ష ప్రయాణంలో ఏదైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ఎలా ఎదుర్కొవాలనే దానిపై శిక్షణ ఇస్తారు.. ఎందుకంటే ఎవరూ అందుబాటులో ఉండరు. ఇక, అక్కడ చేయలేనిదేదైనా ఉందంటే అది డెంటల్‌ సర్జరీ మాత్రమే.. అందుకే ఎలాంటి సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు.. నేను రెండు జ్ఞాన దంతాలను తొలగించుకున్నాను’’ అని శుక్లా తెలిపారు.ఈ కార్యక్రమంలో శుక్లాతోపాటు ఇస్రో మానసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌‌కు ఎంపికైన గ్రూప్‌ కెప్టెన్లు ప్రశాంత్‌ నాయర్‌, అంగద్‌ ప్రతాప్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ నాయర్‌ మూడు, ప్రతాప్‌ నాలుగు దంతాలను తొలగించుకున్నారని శుక్లా చెప్పారు. కాబబట్టి వ్యోమగామి కావాలంటే మీరు మీ జ్ఞానాన్ని వదులుకోవాల్సిందేనంటూ శుక్లా చమత్కరించారు. ఈ ఏడాది ఇస్రో-నాసా సహకారంతో అమెరికాకు చెందిన యాక్సియం స్పేస్‌ చేపట్టిన మిషన్‌లో శుభాంశు శుక్లా ఐఎస్ఎస్‌కు వెళ్లి క్షేమంగా తిరిగొచ్చిన విషయం తెలిసిందే. 18 రోజుల పాటు సహా నలుగురు వ్యోమగాములు.. అక్కడ పలు ప్రయోగాలు చేపట్టారు. స్పేస్ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ఈ ఏడాది జూన్ 25న శుక్లా అంతరిక్ష యాత్ర మొదలైంది. ఈ మిషన్‌కు నాసా వ్యోమగామి పెగ్గీ విట్సన్ కమాండర్‌గా.. శుభాన్షు శుక్లా పైలట్‌గా వ్యవహరించారు.