మహారాష్ట్ర పుణే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అభ్యర్థులు ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నారు. సంప్రదాయబద్ధమైన హామీలు, నమస్కారాలకు కాలం చెల్లిందని భావిస్తున్న నేతలు.. ఓటర్లను ఆకర్షించేందుకు కనీవినీ ఎరుగని రీతిలో ఖరీదైన కానుకలను ఎరగా వేస్తున్నారు. పైథానీ చీరలు, లగ్జరీ కార్ల నుంచి ఏకంగా ప్లాట్లు, ఫారిన్ టూర్ల వరకు ఉచిత హామీల పర్వం కొనసాగుతోంది. ఇవి చూసి ఓటర్లు మాత్రమే కాకుండా రాజకీయ విశ్లేషకులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పుణేలోని పలు వార్డుల్లో అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. లోహేగావ్, ధనోరి ప్రాంతాల్లో ఒక అభ్యర్థి మహిళా ఓటర్ల కోసం లక్కీ డ్రా నిర్వహించి.. విజేతలకు ఒక్కొక్కరికి సుమారు 1100 చదరపు అడుగుల భూమిని ఇస్తామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది కేవలం ఓటర్లను ప్రలోభపెట్టడం కాదని.. మహిళా సాధికారత కోసమేనని సదరు అభ్యర్థి సమర్థించుకోవడం గమనార్హం. మరోవైపు వాఘోలి ప్రాంతంలో భార్యాభర్తల కోసం 5 రోజుల థాయ్‌లాండ్ పర్యటనను ఆఫర్ చేస్తుండగా.. పింప్రి చించ్వాడ్‌లో నిర్వహించిన లక్కీ డ్రా ద్వారా ఖరీదైన ఎస్‌యూవీ కార్లను బహుమతిగా ఇస్తున్నారు. కేవలం భారీ బహుమతులే కాకుండా నిత్యం ఉపయోగపడే వస్తువులను కూడా అభ్యర్థులు ఓటర్లు పంపిణీ చేసి గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. విమాన్ నగర్ వంటి చోట్ల మహిళల కోసం ప్రత్యేక పోటీలు నిర్వహించి పైథానీ చీరలను అందజేస్తున్నారు. మరికొన్ని వార్డుల్లో బాలికలకు సైకిళ్లు, మహిళలకు కుట్టు మిషన్లు, యూత్‌కు బైక్‌లను పంపిణీ చేయడం ముమ్మరంగా సాగుతోంది. స్థానిక యువతను ఆకర్షించేందుకు లక్షలాది రూపాయల ప్రైజ్ మనీతో క్రికెట్ టోర్నమెంట్లు, బాలీవుడ్ కళాకారులతో సంగీత విభావరి వంటి వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాన్ని లావాదేవీల ప్రజాస్వామ్యం అంటూ అభివర్ణిస్తున్నారు. ఓటర్లను పౌరులుగా కాకుండా కస్టమర్లుగా చూస్తున్నారని.. ఎన్నికలను భవిష్యత్తులో లాభాలు పొందే పెట్టుబడిగా అభ్యర్థులు భావిస్తున్నారని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీన పూణే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో.. నిబంధనలకు విరుద్ధంగా ప్రలోభాలకు గురిచేస్తున్న అభ్యర్థులపై ఎన్నికల అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.