ట్రైన్ ప్రయాణికులకు అలర్ట్.. జనవరి 1 నుంచి మారనున్న రైళ్ల వేళలు.. పూర్తి వివరాలు ఇవే..!

Wait 5 sec.

కొత్త ఏడాదిలో ముఖ్య గమనిక. 2026 జనవరి 1వ తేదీ నుంచి దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలో పలు రైళ్ల రాకపోకల సమయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం, రైల్వే నెట్‌వర్క్ ఆధునీకరణలో భాగంగా కొత్త టైమ్‌టేబుల్‌ను రూపొందించినట్లు రైల్వే శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మార్పుల వల్ల ముఖ్యంగా పలు కీలక రైళ్ల వేళల్లో 5 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు వ్యత్యాసం ఉండనుంది.ప్రయాణికుల ఆదరణ పొందిన సికింద్రాబాద్‌-విశాఖపట్నం (20707) వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వేళల్లో మార్పు జరిగింది. ప్రస్తుతం ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి ఉదయం 5:05 గంటలకు బయల్దేరుతుండగా.. జనవరి 1వ తేదీ నుంచి ఐదు నిమిషాల ముందుగానే అంటే.. ఉదయం 5:00 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. కాబట్టి ప్రయాణికులు ఈ ఐదు నిమిషాల వ్యత్యాసాన్ని గమనించి స్టేషన్‌కు చేరుకోవాలని అధికారులు సూచించారు. వందే భారత్ మాత్రమే కాకుండా.. నిత్యం వేలాది మంది ప్రయాణించే మరికొన్ని సూపర్ ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయాలు కూడా మారాయి.సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (12757): ఈ రైలు ప్రస్తుతం ఉదయం 8:20 గంటలకు బయల్దేరుతుండగా, కొత్త ఏడాది నుంచి 10 నిమిషాల ముందుగా 8:10 గంటలకే ప్రయాణం మొదలవుతుందికాకతీయ ఎక్స్‌ప్రెస్ (17659): సికింద్రాబాద్‌ నుంచి భద్రాచలం వెళ్లే ఈ రైలు సమయంలో గణనీయమైన మార్పు ఉంది. ఉదయం 5:25 గంటలకు బదులుగా 5:00 గంటలకే ఇది సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. అంటే ప్రయాణికులు 25 నిమిషాల ముందుగానే సిద్ధంగా ఉండాలి. వీటితో పాటు మొత్తం 25 రైళ్ల వేళల్లో మార్పులు జరిగినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ వెల్లడించారు.సాధారణంగా రైల్వే టైమ్‌టేబుల్ మారినప్పుడు పాత సమయాల ప్రకారం స్టేషన్‌కు రావడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రైలు సమయం ముందుకు జరిపినప్పుడు, నిమిషాల వ్యవధిలో రైలు మిస్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రయాణానికి ముందే ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ లేదా 'Where is my Train' వంటి యాప్స్ ద్వారా మీ రైలు ఖచ్చితమైన సమయాన్ని సరిచూసుకోవాలి. దక్షిణ మధ్య రైల్వే అధికారిక సోషల్ మీడియా ఖాతాలు, వెబ్‌సైట్‌లో ఉంచిన పూర్తి స్థాయి టైమ్‌టేబుల్‌ను పరిశీలించాలి. కొత్త టైమ్‌టేబుల్ అమలులోకి వచ్చిన మొదటి కొన్ని రోజులు.. కనీసం 30-45 నిమిషాల ముందుగానే స్టేషన్‌కు చేరుకోవడం సురక్షితం. కొత్త ఏడాదిలో ప్రయాణాలు సాఫీగా సాగేందుకు రైల్వే శాఖ చేస్తున్న ఈ మార్పులకు ప్రయాణికులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. మీ టికెట్‌పై ఉన్న సమయాన్ని మరోసారి ధృవీకరించుకుని ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి.