APలో పెద్ద సంఖ్యలో IAS,IPS లకు పదోన్నతులు.. ఆమ్రపాలికి ఏ హోదా అంటే..

Wait 5 sec.

రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పించింది. మొత్తం 41 మంది అధికారులు, 17 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదోన్నతులతో నలుగురు ఐఏఎస్‌లకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా దక్కింది. అలానే పలువురు అధికారులు ఉన్నత స్థాయికి చేరుకున్నారు.1996 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు కె.సునీత, లవ్ అగర్వాల్, ముద్దాడ రవిచంద్ర, శశిభూషణ్ కుమార్లకు ముఖ్య కార్యదర్శుల స్థాయి నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి లభించింది. ఇక ఇన్నాళ్లు సీఎంకి ముఖ్య కార్యదర్శిగా ఉన్న రవిచంద్ర ఇకపై సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న లవ్ అగర్వాల్ అక్కడే తన సేవలను కొనసాగిస్తారు.పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శశిభూషణ్ కుమార్.. పదోన్నతి తర్వాత ఆయన అదే విభాగంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈడబ్ల్యూఎస్ ముఖ్య కార్యదర్శిగా ఉన్న కె.సునీత కూడా అదే స్థానంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారు.2001 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సిద్ధార్థ జైన్ ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో సెక్రటరీ హోదాలో ఉన్నారు. పదోన్నతి తర్వాత ఆయన ముఖ్య కార్యదర్శి హోదాలో అక్కడే కొనసాగుతారు. 2010 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు అడిషనల్ సెక్రటరీల నుంచి సెక్రటరీలుగా పదోన్నతి పొందారు. , సి.నాగరాణి, గంధం చంద్రుడు, నారాయణ భరత్ గుప్తా, జె.నివాస్ ఉన్నారు.వీరిలో గంధం చంద్రుడు తప్ప మిగిలిన నలుగురు సెక్రటరీలుగా యథాస్థానంలోనే కొనసాగుతారు. గంధం చంద్రుడు..కార్మిక శాఖలో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తుండగా.. ఆయనకు సెక్రటరీ హోదా కల్పించి.. ఆపై కార్మిక శాఖ కమిషనర్‌గా నియమించారు. అక్కడ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం.వి. శేషగిరిబాబుకు ఈ బాధ్యతల నుంచి విముక్తి కల్పించారు.ఈ ఏడాది పదోన్నతి పొందిన వారిలో 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు 13 మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది వివిధ జిల్లాల్లో కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జాయింట్ సెక్రటరీ హోదాలో ఉన్న వీరికి ప్రభుత్వం అడిషనల్ సెక్రటరీగా పదోన్నతి కల్పించింది. వీరిలో: హిమాన్షు శుక్లా (నెల్లూరు),కృతిక శుక్లా (పల్నాడు), ఎస్. షణ్మోహన్ (కాకినాడ), దినేష్ కుమార్ (అల్లూరి సీతారామరాజు), కె. విజయ (అనకాపల్లి), జి. లక్ష్మీశ (ఎన్టీఆర్),ఎన్. ప్రభాకర్ రెడ్డి (పార్వతీపురం మన్యం), పి. రాజాబాబు (ప్రకాశం) ఉన్నారు.మరికొంత మంది హెచ్‌వోడీలుగా పనిచేస్తున్నారు.ఇక 2017 బ్యాచ్‌కు చెందిన 10 మంది ఐఏఎస్ అధికారులు డిప్యూటీ సెక్రటరీల నుంచి జాయింట్ సెక్రటరీలుగా పదోన్నతులు పొందారు. అసిస్టెంట్ సెక్రటరీ హోదాలో ఉన్న 2022 బ్యాచ్‌కు చెందిన మరో 8 మందికి ప్రభుత్వం డిప్యూటీ సెక్రటరీ హోదా కల్పించింది.ఐపీఎస్ అధికారుల విషయానికొస్తే, ఏపీ కేడర్‌కు చెందిన 17 మంది ఐపీఎస్ అధికారులు పదోన్నతులు పొందారు. ఏడీజీ ర్యాంకులో ఉన్న శంకబ్రత్ బాగ్చి (విశాఖ సీపీ)కి డీజీపీ స్థాయి పదోన్నతి లభించింది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న వినీత్ బ్రిజిలాల్‌కు ఏడీజీ ర్యాంకు దక్కింది. విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టితో పాటు సెంథిల్ కుమార్, షేముషి బాజ్‌పాయ్‌లకు ఐజీ హోదాతో ప్రమోషన్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.గజరావ్ భూపాల్ (తెలంగాణ సర్వీస్), గ్రేవల్ నవ్‌దీప్ సింగ్ (కేంద్ర సర్వీసుల్లో)లకు పదోన్నతి కల్పించారు. కానీ అది వారు రాష్ట్ర కేడర్‌కు తిరిగి వచ్చాకే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు డీఐజీగా ప్రమోట్ అయ్యారు ఇక 9 మంది ఎస్పీ స్థాయి అధికారులకు సీనియర్ స్కేల్ హోదా కల్పించారు. వీరిలో గీతా దేవి, మేరీ ప్రశాంతి, ఐశ్వర్య రస్తోగి, అద్నాన్ నయీమ్ హస్మి, నరసింహ కిశోర్, ఏఆర్ దామోదర్, రవిశంకర్ రెడ్డి, హర్షవర్ధన్ రాజు, గంగాధర్ రావులు ఉన్నారు.