రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల్లో ఒకటైన అన్నమయ్య జిల్లాను ప్రభుత్వం రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 4 నియోజకవర్గాలలోని 19 మండలాలతో మదనపల్లె జిల్లా ఏర్పాటు చేస్తే, ఆ తర్వాత అన్నమయ్య జిల్లా కేవలం మూడు నియోజకవర్గాలతో రాష్ట్రంలోనే అతి చిన్న జిల్లాగా మిగిలిపోనుంది. ఈ నేపథ్యంలో, శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన జిల్లాల పునర్విభజనపై జరిగిన సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.చిన్న జిల్లాల వల్ల ఇప్పటికే తెలంగాణలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, అన్నమయ్య జిల్లాను ప్రత్యేక జిల్లాగా కొనసాగించలేని పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అధికారులు వివరించారు. రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో, రాజంపేటను వైఎస్సార్‌ కడపలో, రాయచోటిని కొత్తగా ఏర్పాటు చేయనున్న మదనపల్లె జిల్లాలో విలీనం చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులు ప్రతిపాదించారు. సంబంధించి ప్రజల నుంచి వస్తున్న విన్నపాలు, అభ్యంతరాలు, నిరసనలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.ఈక్రమంలో విశ్వసనీయ వర్గాల ప్రకారం, అన్నమయ్య జిల్లాను రద్దు చేసి, దానిలోని మండలాలు, డివిజన్లను తిరుపతి, కడపతో పాటు కొత్తగా ఏర్పడనున్న మదనపల్లె జిల్లాలో విలీనం చేయాలని యోచిస్తున్నారు. దీనిపై ఆదివారం మరోసారి సీఎం సమక్షంలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఆ తర్వాత సోమవారం జరిగే క్యాబినెట్ మీటింగ్‌లో దీన్ని ఆమోదానికి పంపించనున్నారు. అన్నమయ్య జిల్లాను జాబితా నుంచి తొలగిస్తే, మొత్తం జిల్లాల సంఖ్య 28కి చేరుతుంది.జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపై ప్రజల నుంచి మొత్తం 927 అభ్యంతరాలు రాగా, వాటిపై సీఎం, మంత్రులు, అధికారులు శనివారం సమగ్రంగా చర్చించారు. కొన్నిచోట్ల మార్పులు సూచించారు. ఈ మార్పులపై ఆదివారం మరోసారి చర్చించి, తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నిర్ణయాలను 29న మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి, 31న తుది నోటిఫికేషన్‌ జారీ చేస్తారు.నవంబర్ నెల 27న ఏపీ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్లు, జిల్లాల్లో మార్పులు, చేర్పులకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనిపై డిసెంబర్ 27 వరకు అంటే నెల రోజులపాటు అభ్యంతరాలను స్వీకరించింది. నెలాఖరు నాటికి ఫైనల్ నోటిఫికేషర్ జారీ చేస్తారు.జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంతో పాటుగా, అధికారులు గ్రేటర్‌ విజయవాడ, గ్రేటర్‌ తిరుపతిల ఏర్పాటుపై సీఎం చంద్రబాబుకు సమగ్ర ప్రజంటేషన్‌ ఇచ్చారు. ముఖ్యమంత్రి కూడా ఈ ప్రతిపాదనలకు సానుకూలత వ్యక్తం చేశారు. అయితే, జనగణన (Census) నేపథ్యంలో వీటి ఏర్పాటుకు సరిపడా సమయం లేదని అధికారులు తెలిపారు. ఈ నగరాల్లో కలపనున్న పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం 2026 ఫిబ్రవరి వరకు ఉంది. వారి నుంచి తీర్మానాలు కూడా రావాల్సి ఉంది. దీనికి కూడా సమయం సరిపోదని, కాబట్టి తాత్కాలికంగా ఈ ప్రతిపాదనలను పక్కన పెట్టాలని.. జనగణన పూర్తయ్యాకే ఈ ప్రక్రియ చేపట్టాలని సీఎం సూచించారు.