తెలంగాణలోని మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. గ్రామీణ మహిళల కోసం ప్రత్యేకంగా వర్క్‌షెడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జాతీయ ఉపాధి హామీ పథకం (వీబీ జీ రాంజీ) కింద ప్రతి గ్రామంలో రూ. 10 లక్షల అంచనా వ్యయంతో వీటిని నిర్మించనున్నారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తూ.. భూసేకరణ, నిర్మాణ ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలను అందించింది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి మినహా మిగిలిన 31 జిల్లాల్లో ఈ పథకం వర్తించనుంది.ప్రస్తుతం విద్యార్థులకు అవసరమైన పాఠశాల యూనిఫామ్‌లను కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించింది. టెస్కో (TESCO) ద్వారా వస్త్రాలను సేకరించి, మహిళా సమాఖ్యల సభ్యుల ద్వారా వీటిని కుట్టిస్తున్నారు. అయితే సరైన పని ప్రదేశం లేకపోవడం, వస్త్రాలను భద్రపరిచేందుకు వీలు లేకపోవడంతో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో శాశ్వత ప్రాతిపదికన వర్క్‌షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ ఉపాధి కేంద్రాల నిర్మాణం కోసం ప్రభుత్వం పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రతి వర్క్‌షెడ్‌ను 200 చదరపు గజాల స్థలంలో నిర్మిస్తారు. 569.75 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్లాబ్‌తో కూడిన పక్కా భవనం ఉంటుంది. ఇందులో 500 చదరపు అడుగుల విశాలమైన హాల్ ఉంటుంది. పని చేయడానికి అనుకూలమైన వాతావరణం కోసం రెండు తలుపులు, 6 కిటికీలు, 6 సీలింగ్ ఫ్యాన్లు, 8 ట్యూబ్‌లైట్లు, 7 ఫ్లోరోసెంట్ లైట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉపాధి హామీ పథకంలోని సామగ్రి నిధుల నుంచి ఈ ఖర్చును భరిస్తారు.ఈ వర్క్‌షెడ్ల నిర్మాణం పూర్తిగా పారదర్శకంగా సాగనుంది. ముందుగా గ్రామాల్లోని మహిళా సమాఖ్యలు తమకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకుని గ్రామ పంచాయతీకి దరఖాస్తు చేయాలి. ఆ తర్వాత గ్రామసభ తీర్మానాన్ని ఎంపీడీవోకు పంపిస్తారు. ఎంపీడీవో స్థల పరిశీలన చేసిన అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు ద్వారా ప్రతిపాదనలు కలెక్టర్‌కు చేరుతాయి. కలెక్టర్ తుది అనుమతి ఇవ్వగానే పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు నిర్మాణ పనులను ప్రారంభిస్తారు.ఈ వర్క్‌షెడ్లు కేవలం దుస్తులు కుట్టడానికి మాత్రమే పరిమితం కావు. ఇవి బహుళ ప్రయోజనకర కేంద్రాలుగా పనిచేస్తాయి. స్థానిక వ్యవసాయ ఉత్పత్తులతో ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు వీటిని వాడుకోవచ్చు. పాపడాల తయారీ, ప్యాకేజింగ్, ఇతర కుటీర పరిశ్రమలకు ఈ హాల్స్ నిలయాలుగా మారుతాయి. గ్రామీణ మహిళలకు కొత్త నైపుణ్యాలను నేర్పించేందుకు శిక్షణ శిబిరాలను ఇక్కడే నిర్వహించవచ్చు. ఈ చొరవ వల్ల గ్రామీణ మహిళలకు ఇంటి వద్దే గౌరవప్రదమైన ఉపాధి లభించడమే కాకుండా, వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వారు భాగస్వాములు అవుతారని ప్రభుత్వం ఆశిస్తోంది.