త్రిగుణ్, అఖిల్‌ రాజ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన హారర్ థ్రిల్లర్ మూవీ 'ఈషా'. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పించిన ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీ వాస్ థియేటర్లలో విడుదల చేశారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజైన ఈ సినిమాకి కొందరు వ్యక్తులు కావాలనే నెగెటివ్‌ రివ్యూలు ఇచ్చారని మేకర్స్ ఆరోపిస్తున్నారు. 'మన ఈషా కోసం నిలబడండి - చిన్న సినిమాలను కాపాడండి' పేరుతో నిర్వహించిన ఈవెంట్ లో నిర్మాత వంశీ నందిపాటి కీలక వ్యాఖ్యలు చేశారు. వంశీ నందిపాటి మాట్లాడుతూ.. ''ఈషా సినిమాకి ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది.టికెట్ బుకింగ్స్ కూడా బాగున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. కొన్ని కారణాల వల్ల సంతోషంగా లేను. 90 శాతం రివ్యూలు బాగా వచ్చాయి.. 10 శాతం కొంచం అటు ఇటుగా వచ్చాయి. మేం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. మనకి నచ్చింది ఇంకొకరికి నచ్చాలని లేదు కాబట్టి, రివ్యూలను నేను ఆ రివ్యూలను స్వాగతిస్తున్నాను. తొంబై శాతం మంచి రివ్యూలు వచ్చినందుకు హ్యాపీ. కానీ సినిమాపై ఒక నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. దానికి బాధ అన్ హ్యాపీగా ఉన్నా''''పెయిడ్ ట్వీట్లు, ఫేక్ బుక్ మై షో రేటింగ్ సంస్కృతి ఇండస్ట్రీకి మంచిది కాదు. మనమంతా ఒక ఫ్యామిలీ. మనమీద ఎవరైనా రాళ్లు రువ్వితే మనందరం కలిసికట్టుగా నిలబడాలి. అలా నిలబడాల్సిన టైమ్ ఇది. 'మిత్రమండలి' సినిమా విషయంలో ఇలానే జరిగినా మేము ప్రెస్ మీట్ పెట్టలేదు. కానీ ఒక మంచి సినిమాని నెగెటివ్ చేస్తే మేము వంద శాతం ప్రొటెస్ట్ చేస్తాం. దాంట్లో ఎటువంటి సంకోచం లేదు'' అని అన్నారు. ''ఈషా సినిమాకి నైట్ ప్రీమియర్ షోలన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. రిలీజ్ రోజు బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి. 70 శాతం ఆక్యుపెన్సీ ఉంది. చిన్న సినిమాకి ఇది రేర్ ఫీట్ అని హ్యాపీగా పడుకున్నా. ఉదయం నిద్రలేచి చూసేసరికి బుక్ మై షో రేటింగ్ 10కి 5 ఉంది. టప్పున పడిపోయింది. హౌస్ ఫుల్స్ పడ్డాయి.. చూసినవాళ్లు చాలా బాగుంది అని అంటున్నారు. అలాంటిది రేటింగ్ 5కి పడిపోయింది. అలా జరిగింది అంటే అది కచ్చితంగా పెయిడ్ క్యాంపెయినే. మీరు 1000 కొట్టిస్తే నేను 2000 కొట్టించగలను.. ఒక్కసారిగా రేటింగ్ పెంచగలను. సోషల్ మీడియాలో ఇలాంటివి పెయిడ్ క్యాంపెయిన్స్ చూడనివా''''కొంతమంది ఆ సినిమాలను టార్గెట్ చేస్తున్నారంటూ బన్నీ వాసు మాఫియా, వంశీ నందిపాటి మాఫియా దిగిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు. మేము రౌడీయిజం, రాజకీయాలు చేయడానికి ఇండస్ట్రీకి రాలేదు. మంచి సినిమాలు తీసి ప్రజలను ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం. మార్నింగ్ 5 రేటింగ్ ఉండగా.. ఇప్పుడు 7.6 అయింది. దానికి కూడా మేం రేటింగ్స్ వేయించుకుంటున్నామని ప్రచారం చేస్తున్నారు. ఆది 'శంభాల' సినిమాకి తగ్గించి మాకు వేసుకున్నామని అంటున్నారు. అలాంటివి మేము చేయం. ఆది నాకు ఒక బ్రదర్. 15 ఏళ్లుగా కష్టపడుతున్న ఆయన సినిమా ఆడాలని ముందు కోరుకునేది నేనే. 'పతంగ్'తో సహా ప్రతి చిన్న సినిమా ఆడాలని ఎప్పుడు కోరుకుంటాం. నెగిటివ్ చేయాలనే ఆలోచనలు మాకు రావు. ఒకవేళ మాపై నెగెటివ్ చేస్తే మేము డిఫెండ్ చేసుకోము అనుకుంటే అది మీ అమాయకత్వం" అని వంశీ నందిపాటి అన్నారు.''ఈషా' మూవీ అమెరికాలో ఇంకా రిలీజ్ కాలేదు. అక్కడ ఉండే ఒక పెద్దాయన ‘ఈషా’పై నెగెటివ్‌ రివ్యూ ఇచ్చాడు. యూఎస్ లో సినిమా రిలీజ్ అవ్వకుండా ఎలా చూశారా అని ఆయన్ని అడిగితే, ఇండియాలో చూశారు అని రిప్లై ఇచ్చాడు. 'నేను సినిమా చూడలేదు.. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది చూసి చెప్పారు' అని అన్నాడు. రిలీజుకు ముందే మావాళ్లు చూశారు అని చెప్పాడు. అంటే ఎవరో ఏదో చెబితే, అదంతా పెద్ద చాటభారతంలా రాశాడు. ఇలా నెగెటివ్‌ రివ్యూలు ఇస్తే దాన్ని నమ్మి, జనాలు సినిమా చూడరు అనుకుంటున్నారు. జనాలేమీ పిచ్చోళ్లు కారు. ప్రీమియర్‌ వేసిన థియేటర్‌లన్నీ హౌస్‌ఫుల్‌ అయ్యాయి. సినిమా బాగుందని చూసిన ఆడియన్స్ చెబుతున్నారు'' అని నిర్మాత వంశీ చెప్పుకొచ్చారు. దామోదర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఇళ్లలో రెండు, మూడు గదుల్లో 10-20 కంప్యూటర్లు పెట్టుకుని, ఇద్దరు మనుషులతో సినిమాపై నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని ఆరోపించారు. ''ఎందుకయ్యా ఇవన్నీ. నీ సినిమాను నువ్వు ప్రమోట్ చేసుకో.. వేరే వాళ్లతో నీకెందుకు? ఇంత నీచంగా వ్యాపారం చేస్తారా? పెంచాలనుకుంటే పెంచడం, దించాలనుకుంటే దించడం. ఏంటయ్యా ఇది? థియేటర్లు హౌస్‌ ఫుల్‌గా ఉన్నాయి. ఇప్పటికైనా ఇలాంటి నెగెటివ్‌ రివ్యూలు మానుకోండి. నేను మాట్లాడాల్సి వస్తే ఇండస్ట్రీలో మీ కెరీర్‌ ముగిసినట్లే'' అని హెచ్చరించారు.