కనుమరుగవుతున్న రూ. 10 నోట్లు.. ఇక కనిపించవా.. అసలు ఆర్బీఐ ప్లాన్ ఏంటి?

Wait 5 sec.

: ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లలో అతి తక్కువ విలువైన నోటుగా రూ. 10 కొనసాగుతోంది. ప్రతి సామాన్యుడి జేబులో ఈ నోటు తప్పనిసరిగా ఉంటుంది. చిన్న చిన్న అవసరాలకు, కూరగాయలు కొనుగోలు చేయడం, టీస్టాల్స్ దగ్గర, ఆటో, బస్ టికెట్ ఛార్జీలు చెల్లించడం ఇలా చాలా మన రోజువారీ అవసరాల కోసం 10 రూపాయల నోటును వినియోగిస్తారు. ఇంకా చిన్న చిన్న వ్యాపారుల దగ్గర నుంచి పెద్ద దుకాణాదారుల వరకు ప్రతి ఒక్కరూ ఈ నోటును తమ ప్రాథమిక లావాదేవీల కోసం వినియోగిస్తుంటారు. అయితే కొంత కాలంగా ఈ నోట్లు మార్కెట్లో పెద్దగా కనిపించడం లేదు. దీంతో చిల్లర సమస్య తలెత్తుతోంది. ఇంకా కొత్తగా ముద్రించిన నోట్లు కనిపించడమే లేదు. ఇప్పటికీ . అవి చెల్లుబాటు అవుతాయో కావో అన్న ఆందోళనతోనే చాలా మంది అవే పాత, చిరిగిన నోట్లతో క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. ఈ చిన్న నోట్ల కొరతతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా 20-30 రూపాయల్లో ఏమైనా కూరగాయలు కొనుగోలు చేస్తే.. జనం రూ. 100 నోటు ఇస్తే.. చిల్లర ఇవ్వడం విక్రేతలకు సమస్యగా మారింది. ఇతర కిరాణాదారులు, బస్ కండక్టర్లు కూడా ఇదే సమస్యతో సతమతం అవుతున్నారు. ఇలా చిల్లర లేక చిన్న చిన్న వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయి. ఇటీవల ఆర్బీఐ ఉద్యోగుల సంఘం కూడా రూ. 10, 20, 50 నోట్ల కొరత గురించి ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా సెబీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఇవి కనిపించడం లేదని పేర్కొంది. దీనికి పరిష్కారం చూపాలని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌‌కు లేఖ రాసింది.ఇటీవలి కాలంలో రూ. 10 నోటుకు బదులు.. రూ. 10 నాణెమే ఎక్కువగా కనిపిస్తోంది. రూ. 10 నాణెం చెల్లదని కొంత కాలంగా ప్రచారం జరిగినా.. ఆర్బీఐ దానిని తోసిపుచ్చింది. కచ్చితంగా ఈ నాణేలు చెల్లుతాయని.. ఎవరైనా తీసుకోకుంటే ఫిర్యాదు చేయొచ్చని స్పష్టత ఇవ్వగా చలామణిలో ఈ నాణేలు పెరిగాయి. ఇదే సమయంలో 10 విలువైన నోట్లు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా రూ. 10 నోట్ల జీవిత కాలం తక్కువగా ఉండటం వల్ల వీటిని కొత్తగా ముద్రించట్లేదని తెలుస్తోంది. రూ. 10 నాణెం తయారీ కంటే.. నోట్ల ముద్రణకే ఖర్చు తక్కువ అయినప్పటికీ.. జీవిత కాలం తక్కువగా ఉండటంతోనే ఈ నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. నాణేలు జీవిత కాలం పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు రూ. 10 నోట్ల కొరత నేపథ్యంలో.. 10 రూపాయల నాణేల్ని మార్కెట్లో ఎవరూ తిరస్కరించట్లేదని చెబుతున్నారు. కేవలం నోట్లు మాత్రమే కాదు.. రూ. 10 విలువైన స్టాంప్ పేపర్లు కూడా మార్కెట్లో ఇప్పుడు పెద్దగా దొరకట్లేదు. వీటి బదులు ఎక్కువ విలువైన స్టాంప్ పేపర్లను కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు పెరిగిన మాట వాస్తవమే. చాలా లావాదేవీల కోసం యూపీఐని ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ప్రతి చిన్న ఖర్చులకు.. 5, 10 రూపాయల కోసం కూడా యూపీఐ ద్వారా డబ్బులు పంపించడం అందరూ చేయరు. ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో.. ఇంటర్నెట్ సరిగా లేని చోట కూడా నగదు ఇవ్వడమే దిక్కు. ఇంకా డిజిటల్ పేమెంట్స్ గురించి తెలియని రోజువారీ కూలీలు, వృద్ధులు, సామాన్య మహిళలకు ఈ సమస్య ఎక్కువగా ఉంది.