ఆ మార్గంలో కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే.. రూ.12 వేల కోట్లతో 4 లేన్ల ఎక్స్‌ప్రెస్ వే, త్వరలోనే అందుబాటులోకి..!

Wait 5 sec.

గోవా రాజధాని పనాజీ నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్ మధ్య ప్రయాణాన్ని అత్యంత వేగవంతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తెలంగాణ, కర్ణాటక, గోవా రాష్ట్రాలను కలిపే ఈ మెగా ప్రాజెక్టు పనులు షురూ అయ్యాయి. ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్ (ఈసీ-10) పనులు ప్రస్తుతం కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా ఐహోళె సమీపంలో జోరుగా సాగుతున్నాయి. గోవాలోని పనాజీ నుంచి తెలంగాణలోని హైదరాబాద్ వరకు సుమారు రూ. 12,000 కోట్ల అంచనా వ్యయంతో ఈ 4 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మిస్తున్నారు.ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన భాగం కర్ణాటకలోని బెల్గావి-రాయచూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే (ఎన్‌హెచ్-748ఏ). ఇది పూర్తిగా కొత్త మార్గం కావడంతో.. పాత రోడ్లతో సంబంధం లేకుండా వేగవంతమైన ప్రయాణానికి అనువుగా రూపొందిస్తున్నారు. బాగల్‌కోట్ జిల్లాలో 102 కిలోమీటర్ల మేర సాగే ఈ రహదారి కోసం ఇప్పటికే 90 శాతం భూసేకరణ పూర్తి అయింది. త్వరలోనే పనులు కూడా ప్రారంభించానున్నారు. వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కేవలం బాగల్‌కోట్ జిల్లాలోనే 9 మెయిన్ ఫ్లై ఓవర్లను నిర్మించనున్నారు. కర్ణాటకలో ఈ ప్రాజెక్టును 4 ప్యాకేజీలుగా విభజించారు. మూడో, నాలుగో ప్యాకేజీల కింద బాగల్‌కోట్‌లో సుమారు 645 హెక్టార్ల భూమిని సేకరించి పనులు ప్రారంభించారు.ఈ ఎక్స్‌ప్రెస్‌వే కేవలం వాహనదారులకు ప్రయాణ సమయాన్ని తగ్గించడం మాత్రమే కాకుండా.. తెలంగాణ, కర్ణాటక, గోవా మూడు రాష్ట్రాల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పారిశ్రామిక అనుసంధానం జరుగుతుందని పేర్కొంటున్నాయి. గోవాలోని ఫిషింగ్, ఫార్మా రంగాలు, బెల్గావిలోని ఆహార ధాన్యాలు, రాయచూర్‌లోని వ్యవసాయం, హైదరాబాద్‌లోని ఐటీ, ఫార్మా రంగాలను ఈ హైదరబాదా పనాజీ ఎకనామిక్ కారిడార్ హైవే అనుసంధానిస్తుంది.సిమెంట్, ఖనిజాలు, పత్తి, పండ్లు, చెరకు వంటి ఉత్పత్తుల రవాణా కూడా మరింత సులభతరం అవుతుంది. ఈ మార్గం గుండా వెళ్లే పట్టణాలు, గ్రామాల్లో కొత్త హోటళ్లు, సర్వీస్ సెంటర్లు, వ్యాపారాలు పుట్టుకొచ్చి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని బాగల్‌కోట్ ఎంపీ పీసీ గడ్డిగౌడర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఈసీ-10 హైవే రాయచూర్ జిల్లాలోని సిర్వార్, కవితాళ్ మీదుగా బాగల్‌కోట్‌లోకి ప్రవేశించి.. అమినిగడ్, కెరూర్ మీదుగా బెల్గావి జిల్లాలోని రామ్ దుర్గ్, బైలహోంగల్ వైపు వెళ్తుంది. రానున్న 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అక్కడక్కడా భూసేకరణ సమస్యలు, రాజకీయ అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ.. పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.