టాటా కంపెనీతో పర్యావరణానికి ముప్పు.. రూ.14 వేల కోట్లకు దావా వేసిన ఎన్జీవో!

Wait 5 sec.

: దేశీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ టాటా గ్రూప్‌నకు చెందిన టాటా స్టీల్‌కు ఊహించని షాక్ తగిలింది. టాటా స్టీల్ నెదర్లాండ్ యూనిట్ పై డచ్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ భారీ మొత్తానికి దావా వేసింది. నెదర్లాండ్స్‌లోని టాటా స్టీల్ కంపెనీ కార్యకలాపాల కారణంగా అక్కడి స్థానికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని, పర్యావరణానికీ ముప్పుగా మారినట్లు ఆరోపించింది. రూ. 14 వేల కోట్లకుపైగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. టాటా స్టీల్ కారణంగా పర్యావరణంపై ప్రభావం పడుతోందని, దానికి పరిహారంగా 1.6 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 14,370 కోట్లు చెల్లించాలని హోర్లెంలోని నార్త్ హోలెండ్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేసింది. ఈ విషయాన్ని తాజాగా టాటా స్టీల్ కంపెనీ శుక్రవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. నెదర్లాండ్స్‌లోని వెల్సన్ నూర్డ్‌లో నిర్వహిస్తున్న టాటా స్టీల్ ఐజ్మెయిడన్ బీవీ నుంచి వెలువడే కాలుష్య కారకాల తో స్థానికులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంటూ ఎన్జీవో దావా వేసిందని టాటా స్టీల్ ప్రకటనలో తెలిపింది. స్థానికులు ఇంట్లో ఆనందకర క్షణాలు గడపలేకపోతున్నారని, వారి ఆస్తుల విలువ పడిపోయిందని ఎన్జీవో పేర్కొందని తెలిపింది. అయితే, ఎన్జీవో ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలు ఏవీ లేవని టాటా స్టీల్ పేర్కొంది. రెండు దశల్లో దీనిపై వాదనలు జరుగుతున్నాయని, ఒక్కో దశ పూర్తయ్యేందుకు కనీసం రెండు మూడేళ్లు అయినా పడుతుందని తెలిపింది. కాబట్టి పరిహారం అనే ప్రశ్న ఇప్పటికిప్పుడు ఉత్పన్నం కాదని పేర్కొంది. మరోవైపు డచ్ ప్రభుత్వంతో కలిసి పర్యావరణ కాలుష్యం అదుపునకు చర్యలు మొదలు పెట్టామని పేర్కొంది. కాలుష్యం అదుపు చేసేందుకు తమ కంపెనీ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొంది. డచ్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నామని, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపించే వాటిని తగ్గించేందుకే చూస్తామని తెలిపింది.