తెలంగాణను పగటిపూట ఎండ తక్కువగా ఉండటం, రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదు కావడంతో తెలంగాణ ప్రజలు గజగజలాడుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోగా.. సుమారు 25 జిల్లాల్లో 14 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. మంగళవారం సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లెలో 6.9 డిగ్రీలు నమోదు కాగా.. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది.ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మెదక్, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో డిసెంబర్ 26 వరకు ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు హైదరాబాద్, హనుమకొండ, కరీంనగర్ సహా 15 జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రాజధాని హైదరాబాద్‌లో రానున్న 24 గంటల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 13 డిగ్రీలుగా ఉండొచ్చని, ఉదయం వేళ దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గి వాహనదారులకు ఇబ్బందులు తప్పవని అధికారులు తెలిపారు.తీవ్రమైన చలి, శీతల గాలుల (Cold Wave) కారణంగా ప్రజలు ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు శ్వాసకోశ సంబంధిత సమస్యల బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు అవసరమని.. వేడి వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. తెల్లవారుజామున ప్రయాణించే వాహనదారులు పొగమంచు దృష్ట్యా ఫాగ్ లైట్లు ఉపయోగించాలని, వేగం తగ్గించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రానున్న ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నందున, వెచ్చని దుస్తులు ధరించడం మరియు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని చెబుతున్నారు.