రాష్ట్రంలో మంత్రి వర్గంలో మార్పులు, కొత్త వారికి అవకాశం కల్పించడంపై కొనసాగుతున్న సస్పెన్స్.. మరికొన్ని రోజులు సాగనుంది. త్వరలోనే తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ, ప్రక్షాళన ఉంటుందనే వార్తలు వస్తున్న వేళ.. అది ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగా.. సోమవారం ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలోనే కేరళలో కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్‌కు మెజార్టీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య.. హస్తం పార్టీ హైకమాండ్.. అటు వైపు దృష్టి పెట్టనుంది. ఈ క్రమంలోనే ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కేబినెట్ విస్తరణలో.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పిన వారికే కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోద ముద్ర వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే సమయంలో ఇప్పటికే కేబినెట్‌లో ఉన్న పలువురు మంత్రుల వ్యవహార శైలిపై హైకమాండ్ అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో వారిని తప్పించి.. కొత్తవారికి అవకాశం కల్పించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే మంత్రివర్గంలో రెండు ఖాళీలు ఉండగా.. మంత్రులను తప్పిస్తే మరింత మందికి అవకాశాలు రానున్నాయి. ఇక ఇప్పటికే ఉన్న 2 ఖాళీల్లో ఒకటి ఎస్టీలకు కేటాయించే సూచనలు ఉన్నాయి. దీంతో బాలూ నాయక్, రామచంద్రు నాయక్‌ వంటి వారు ఆ కేటగిరీలో మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారు. డిప్యూటీ స్పీకర్‌ పోస్టుకు గతేడాది రామచంద్రునాయక్‌ను కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసినా అది అసెంబ్లీలో ఎంపిక జరగకపోవడంతో ఎటూ తేలలేదు. అంతేకాకుండా గత అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌ ఆఫీసును రెడీ చేసినా ఆ ప్రక్రియ మాత్రం ముందుకు సాగలేదు. ఇక మిగిలిన సీటు కోసం ఎవరిని ఎంపిక చేస్తారనేది ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది. కేబినెట్‌లో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడంతో వారికి అవకాశం దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు సలహాదారుగా కేబినెట్‌ మంత్రి హోదాలో మాజీ మంత్రి, సీనియర్‌ ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డి ఉన్నారు. కేబినెట్ భేటీలకూ ప్రత్యేక ఆహ్వానితునిగా ఉన్నారు. ఆయనను కేబినెట్‌లోకి తీసుకోవాలనే ప్రయత్నం ఎప్పటినుంచో జరుగుతుండటంతో మళ్లీ ఆయన పేరు తెరపైకి వస్తోంది. ఇక అదే జిల్లాకు చెందిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు మంత్రివర్గంలో స్థానం దక్కొచ్చనే ప్రచారం జరుగుతున్న వేళ.. తమ ఇద్దరి ఆధ్వర్యంలో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం గమనార్హం. గతంలో వైఎస్‌-డీఎస్‌లాగా రేవంత్-మహేష్‌కుమార్‌గౌడ్ జోడి పని చేస్తుందని సీఎం పలు సభల్లో స్పష్టం చేశారు. దీంతో మహేశ్‌కుమార్‌గౌడ్‌ను పీసీసీ చీఫ్‌గానే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చినప్పటి నుంచి మంత్రి పదవిపై ఆశగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా రేసులో ఉన్నారు. ఈసారి ఆయన ఆశగా కూడా ఉన్నారు. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో హైకమాండ్‌దే ఫైనల్ నిర్ణయం కానుంది. మంత్రి పదవి కోసం చూస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు కేబినెట్ హోదాతో.. సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి ఇచ్చినా బాధ్యతలు చేపట్టలేదు. వీరితోపాటు.. మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, మదన్‌మోహన్‌రావు కేబినెట్‌లో చోటుకోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు మంత్రులుగా ఉన్నవారిలో పలువురి పనితీరుపై కాంగ్రెస్ హైకమాండ్ అసంతృప్తితో ఉందని.. ఈ నేపథ్యంలోనే ఒకరిద్దరికి కేబినెట్ నుంచి ఉద్వాసన పలికి.. వారి స్థానంలో కొత్త వారిని తీసుకువస్తారనే చర్చ జరుగుతోంది. అదే జరిగిందే.. ఎవరినైతే తొలగిస్తారో.. అదే సామాజిక వర్గం నుంచి ఇంకొకరికి అవకాశం కల్పించనున్నారు. ఇక కీలక శాఖలు కూడా ఒకరి నుంచి మరొకరికి మార్చే అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. హోం మంత్రిత్వ శాఖను ఒక సీనియర్‌ మంత్రికి అప్పగించే అవకాశాలు ఉన్నాయని.. ఇతర శాఖల్లో కూడా కొన్ని మార్పులు, చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. అయితే ఒక శాఖను మార్చితే.. దాన్ని సర్దుబాటు చేసేందుకు చాలా మార్పులు చేయాల్సి వస్తుందని.. అలా చేయడం వల్ల మరింత గందరగోళం తలెత్తుందనే భయాల నేపథ్యంలో ఆ ప్రయత్నం జరగకపోవచ్చని సమాచారం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం దృష్టిపెట్టేందుకు కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.