Tamil Nadu Results: చరిత్ర తిరగరాసిన విజయ్.. జయలలిత తర్వాత దళపతే

Wait 5 sec.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన టీవీకే చీఫ్, దళపతి విజయ్‌ జోసెఫ్ అధికార డీఎంకే, అన్నాడీఎంకే కూటమిలను చావుదెబ్బ కొట్టారు. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు విజయ్ పార్టీ 100కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆయన పోటీచేసిన రెండు స్థానాలు పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్‌‌లోనూ విజయం దిశగా సాగుతున్నారు. తొలి అడుగులో రాజకీయ స్థిరత్వం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేసి విజయం అందుకుంటున్నారు. భారీగా ఉన్న అభిమానగణం ఆయనకు ఓటు బ్యాంకుగా మారినట్టు తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. రెండు స్థానాల్లో విజయం సాధించిన విజయ్.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి రికార్డును తిరగరాశారు. ఇప్పటి వరకూ కేవలం జయలలిత మాత్రమే తమిళనాడు ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీచేసి గెలిచారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1954 ప్రకారం.. ఒక అభ్యర్థి ఒకేసారి రెండుచోట్ల పోటీ చేయొచ్చు. రెండు సీట్లలో గెలిస్తే ఏదో ఒక దానికిరాజీనామా చేయాలి. జయలలిత కూడా 1991 అసెంబ్లీ ఎన్నికల్లో బర్గూర్, కాంగేయం నుంచి పోటీచేసి.. రెండింటిలోనూ గెలుపొందారు. దీంతో కాంగేయం స్థానానికి రాజీనామా చేసి బర్గూర్‌ ఎమ్మెల్యేగా ఆమె కొనసాగారు. సరిగ్గా మూడున్నర దశాబ్దాల తర్వాత విజయ్ కూడా రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి, విజయం సాధించారు. వాస్తవానికి విజయ్ పార్టీ గెలుపును ఎవరూ ఊహించలేదు. ఆ పార్టీ మూడో స్థానంతోనే సరిపెట్టుకుంటుందని అందరూ అంచనా వేశారు. కానీ, తమిళ ప్రజలు మాత్రం ఎవరూ ఊహించని తీర్పు ఇచ్చారు. కింగ్ మేకర్ అనుకుంటే.. ఏకంగా కింగ్‌ను చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తల్లకిందులయ్యాయి. అన్ని సంస్థలూ డీఎంకే కూటమిదే అధికారం అని ఢంకా బజాయించాయి. ఒక్క యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం టీవీకే పార్టీకి విజయం సాధించే అవకాశం ఉందని సరిగ్గా అంచనా వేసింది. పార్టీ ఏర్పాటుచేసిన రెండేళ్లకే అధికారంలోకి వచ్చి మరో రికార్డును విజయం సొంతం చేసుకున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసి.. ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.