ఐపీఎల్ 2026ను ఓటమితో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచిన ఆరెంజ్ ఆర్మీ.. ప్లే ఆఫ్స్‌కు కేవలం రెండు అడుగుల దూరంలోనే ఉంది. ఇప్పటికే టాప్ 4 టీమ్స్‌లో ఒకటిగా స్థిరపడిన సన్‌రైజర్స్ టాప్ 2లో ప్లేస్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుసగా ఐదు ఆరు మ్యాచ్‌లలో ఇప్పటి వరకు విజయం సాధించలేదు. ఈ సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచిన ఎస్ఆర్‌హెచ్, హోం గ్రౌండ్ ఉప్పల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఇవాళ జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే రికార్డు సృష్టించే అవకాశం ఉంది. 2017 -18, 2022లో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధికంగా వరుసగా ఐదు మ్యాచ్‌లలోనే గెలిచింది. మళ్లీ ఈ ఏడాది కూడా ఐదు మ్యాచ్‌లలో గెలిచిన ఆరెంజ్ ఆర్మీ ఆరో విజయం అందుకోవాలని తహతహలాడుతోంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈరోజు జట్లు తలపడుతున్నాయి. ఆదివారం డబుల్ హెడ్డర్ కావడంతో ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం అవుతుంది. మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. ఈ సీజన్ ఆరంభంలో కేకేఆర్‌ను వాళ్ల హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కి దక్కిన తొలి విజయం కూడా అదే. ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్ల మధ్య 31 మ్యాచ్‌లు జరిగితే సన్‌రైజర్స్ 11 మాత్రమే గెలవగా, కేకేఆర్ 20 మ్యాచ్‌లలో గెలిచింది. హైదరాబాద్‌లో ఏడు మ్యాచ్‌లు జరిగితే కోల్‌కతా 4-3తో పైచేయి సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అంచనాఅభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), హర్ష్ దూబే, షాకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, ఇషాన్ కిషన్. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అంచనాఅజింక్య రహానే (కెప్టెన్), టిమ్ సైఫర్ట్, కామెరూన్ గ్రీన్, అంగ్‌క్రిష్ రఘువంశీ, రోవ్‌మన్ పావెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగీ, వరుణ్ చక్రవర్తి.