కేరళలో విజయన్‌కు ఓటమి తప్పదన్న సర్వేలు.. సంబరాలకు రెడీ.. కాంగ్రెస్ బిర్యానీ, బీజేపీ లడ్డూలు సిద్ధం

Wait 5 sec.

కేరళలో అధికార మార్పు తప్పదంటూ దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో.. అక్కడి ప్రతిపక్షాలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌ విజయం తమదేనని సంబరాలకు రెడీ అయింది. ఈ నేపథ్యంలోనే ఫలితాలు వెల్లడి కాగానే.. బిర్యానీ పంచి పెట్టేందుకు చర్యలు చేపట్టింది. మరోవైపు.. బీజేపీ కూడా ఈసారి కేరళలో ఖాతా తెరుస్తామని ధీమాగా ఉండి.. వందల కొద్ది లడ్డూలను తయారు చేయించేందుకు ఆర్డర్లు ఇచ్చింది. ఇటు యూడీఎఫ్, అటు బీజేపీ.. సోమవారం రోజున కేరళలో భారీగా సంబరాలు చేసుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. పినరయి విజయన్ 10 ఏళ్ల పాలన ముగియనుందనే అంచనాలతో ఈ పార్టీలు భారీగా జోష్‌లో ఉన్నాయి. సోమవారం ఉదయం నుంచే కేరళ, తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్‌, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమై.. ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలతో కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి.. గెలుపు తమదే అనే ధీమాలో ఉన్నాయి. ఈ క్రమంలోనే సంబరాలకు సన్నాహాలు చేస్తున్నాయి. విందులు, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి.మలప్పురం జిల్లాలోని పాండిక్కడ్‌ నియోజకవర్గంలో తమదే విజయమని భావిస్తూ.. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్‌ కార్యకర్తలు దాదాపు 5 వేల మంది కోసం బిర్యానీని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బిర్యానీని వండేందుకు 16 పెద్ద పెద్ద గిన్నెలను తీసుకువచ్చినట్లు హస్తం పార్టీ నేతలు తెలిపారు. బిర్యానీని అందరికీ సరఫరా చేసేందుకు భారీ టెంట్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ 10 ఏళ్ల అధికారానికి తెరపడనున్న నేపథ్యంలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సీపీఎం సహా అందరు కార్యకర్తలను స్వాగతిస్తున్నట్లు ఒక కాంగ్రెస్ నేత వెల్లడించారు. ఎప్పటి నుంచో మలప్పురం జిల్లా యూడీఎఫ్‌కు కంచుకోటగా ఉందని.. ఈసారి కూడా అవే ఫలితాలు పునరావృతం అవుతాయని తెలిపారు.మరోవైపు.. కొచ్చిలో సంబరాలకు బీజేపీ రెడీ అవుతోంది. ఇప్పటికే వందలాది లడ్డూలు తయారు చేసేందుకు కమలం పార్టీ నేతలు ఆర్డర్ చేశారు. ఈసారి కేరళలో బీజేపీ కచ్చితంగా ఖాతా తెరుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కాళకూటం, నేమం, పాలక్కడ్, మంజేశ్వర్, తిరువల్ల సహా పలు నియోజకవర్గాలను కైవసం చేసుకుంటామని పేర్కొన్నారు. ఇక గెలుస్తామని నమ్మకం ఉన్న అభ్యర్థుల ప్లకార్డులను కూడా రెడీ చేశారు.