తెలంగాణలో బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. మరోసారి కమలం పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో అధికారంలోకి రాకపోవడానికి కారణం.. బీజేపీ నేతల తీరేనని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ బీజేపీ నేతలకు ఇగో (అహం) ఎక్కువ అని.. అందుకే నేతల్లో మనస్పర్దలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల ఎమ్మెల్యే తాజాగా స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ నేతలపై రాజాసింగ్ మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి.. పార్టీని అధికారంలోకి తీసుకువస్తున్నారని తెలిపారు. అయితే ఇంకా ఎన్నేళ్లు వేరేవాళ్లు పెళ్లి చేసుకుంటే.. మనం డ్యాన్స్ చేయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో.. తెలంగాణ బీజేపీ నేతలు సంబరాలు చేసుకోవడం పట్ల రాజాసింగ్ సెటైరికల్‌గా స్పందించారు. వేరే రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తే సంబరాలు చేసుకునే వారు.. తెలంగాణలో పార్టీని ఎందుకు గెలిపించలేకపోతున్నారని నిలదీశారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు.. బీజేపీని తెలంగాణలో అధికారంలోకి రాకుండా చేస్తారని స్థానిక నేతలపై రాజాసింగ్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు తీసుకుని వస్తారో చెప్పండని నిలదీశారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న రాంచందర్ రావుకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే తెలంగాణలో అధికారం వస్తుందని తేల్చి చెప్పారు. తెలంగాణలో కొందరు బీజేపీ నేతలు తమ ఈగోయిజాన్ని పక్కన పెట్టాలని హితవు పలికారు. ఈగో లేకుండా పనిచేస్తేనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. కొంతమంది నేతలకు సిగ్గు ఉంటే.. పశ్చిమ బెంగాల్‌లో ఎలా విజయం సాధించారో చూసి నేర్చుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా తెలంగాణ బీజేపీ నేతలపై రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంఘటనలు ఉన్నాయి. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాకపోవడానికి, మరింతగా విస్తరించకపోవడానికి సొంత పార్టీ నేతలే కారణం అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే గతంలో బీజేపీలోనే ఉన్న రాజాసింగ్.. ఆయన చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా.. పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. కానీ రాజాసింగ్ ఎప్పుడూ బీజేపీ హైకమాండ్‌పై విమర్శలు చేయలేదు.