పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. 2011లో తొలిసారి బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన టీఎంసీ.. వరుసగా మూడు పర్యాయాలు విజయం సాధించి.. హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరీ తప్పదని మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేశాయి. కానీ తుది ఫలితాల వరకు వచ్చేసరికి.. బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి 200కు పైగా సీట్లను దక్కించుకుంది. అదే సమయంలో టీఎంసీ 100లోపే పరిమితమైంది. అయితే టీఎంసీ ఓటమికి.. మమతా బెనర్జీ మేనల్లుడు తీరే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో, టీఎంసీ పార్టీలో మమతా బెనర్జీ తర్వాత వారసత్వాన్ని కొనసాగించేందుకు అభిషేక్ బెనర్జీ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. పార్టీలో చేరిన మొదట్లో పార్టీ వ్యూహాలు, అభివృద్ధి సహా పలు కార్యక్రమాల్లో అభిషేక్ బెనర్జీ చురుగ్గా వ్యవహరించేవారు. ఈ నేపథ్యంలోనే 2014 సార్వత్రిక ఎన్నికల్లో డైమండ్‌ హార్బర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసిన అభిషేక్ బెనర్జీ తొలి పోటీలోనే విజయం సాధించారు. ఆ తర్వాత 2019, 2024 ఎన్నికల్లోనూ వరుసగా గెలిచి.. హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నారు. అయితే టీఎంసీలో దీదీ తర్వాత కీలక నేతగా అభిషేక్‌ బెనర్జీ వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను ఒక షాడో సీఎంగా పనిచేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికలతోపాటు గత ఎన్నికల్లోనూ మమతా బెనర్జీని మట్టికరిపించిన మొదట్లో టీఎంసీలోనే ఉండేవారు. దీదీ తర్వాత కీలక నేతగా ఉన్న సువేందు అధికారి.. అభిషేక్ బెనర్జీ వ్యవహారశైలితో ఆ పార్టీలో ఇమడలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. అయితే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా పేరున్న సువేందు అధికారి.. 2021 ఎన్నికల ముందు టీఎంసీ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరిపోయారు. సువేందు అధికారి లాంటి ముఖ్యమైన నేత పార్టీ నుంచి వెళ్లిపోయినా దీదీ పట్టించుకోలేదు. కానీ బెంగాల్‌లో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరిన బీజేపీకి.. సువేందు అధికారి లాంటి ప్రముఖ నేత తోడు కావడంతో.. 2021 ఎన్నికల్లో కమలం పార్టీకి 70కి పైగా స్థానాలు రావడంలో కీలక పాత్ర పోషించాయి. సువేందు అధికారి వెళ్లిపోవడంతో మొదలైన అసమ్మతి.. ప్రస్తుతం ప్రజాగ్రహంగా మారి.. టీఎంసీ పతనానికి కారణమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఎంసీలో అభిషేక్ బెనర్జీ మాటే చెల్లుతుంది అంటూ.. ఆ పార్టీవర్గాలు బహిరంగంగా వెల్లడించడం గమనార్హం.ఇక తన సొంత నియోజకవర్గం డైమండ్‌ హార్బర్‌ మోడల్‌గా ఫ్రీ హెల్త్ క్యాంప్‌లు, పింఛన్ల పంపిణీని అభిషేక్ బెనర్జీ ప్రారంభించారు. అయితే ఈ మోడల్‌ అభివృద్ధి కోసం కాదని.. ఓటర్లను బెదిరించడం, ప్రజలపై దౌర్జన్యాలకు దిగడం వంటిది అని బీజేపీ ఆరోపణలు చేసింది. ఇక ఇటీవల ఫాల్టాలో రీ పోలింగ్‌పై అభిషేక్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి. గుజరాతీ గ్యాంగ్‌ 10 జన్మలు ఎత్తినా బెంగాల్‌లో గెలవలేదంటూ అభిషేక్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అభిషేక్ బెనర్జీ.. దీదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్‌పై విమర్శలు చేయడమే తన పనిగా పెట్టుకోవడం కూడా ఓటర్లను టీఎంసీ వైపు తిప్పుకునేలా చేయలేదు. టీఎంసీ శ్రేణులు దౌర్జన్యాలు, దాడులు చేసినా వారిని కట్టడి చేయని అభిషేక్ బెనర్జీ.. కనీసం స్పందించకపోవడం ఆయనపై నెగిటివిటీని పెంచింది.ఇక బొగ్గు గనుల కుంభకోణానికి సంబంధించిన కేసులో అభిషేక్‌ బెనర్జీతోపాటు ఆయన భార్యపైనా ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. బెంగాల్‌లో అవినీతి రహిత పాలనను అందిస్తామని మమతా బెనర్జీ చేస్తున్న ప్రకటనల వేళ.. ఈ బొగ్గు కుంభకోణంలో అభిషేక్ బెనర్జీ దంపతుల పేరు రావడం బెంగాల్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకువచ్చింది. అదే వారిని బీజేపీ వైపు మొగ్గు చూపేలా చేసినట్లు తెలుస్తోంది.