పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు మోదీ వర్సెస్ దీదీగా సాగాయి. పూర్వరూపం భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్‌ ప్రసాద్ ముఖర్జీ బెంగాలీ నేత అయినప్పటికీ పశ్చిమ్ బెంగాల్‌లో ఆ పార్టీ ప్రస్థానం అంత సులువుగా సాగలేదు. 1980వ దశకంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలతోనే బీజేపీ రాజకీయ అరంగేట్రం ఆరంభమైంది. అసెంబ్లీ కంటే స్థానిక ఎన్నికల్లోనే ఆ పార్టీ ఎక్కువ విజయం సాధించింది. కాలక్రమేణా నిలకడగా తన ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ మంచి పనితీరు కనబరిచిన బీజేపీ ప్రస్తుతం అధికారం కోసం టీఎంసీతో పోరాడే స్థాయికి చేరుకుంది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎదుగుదలకు అనేక కారణాలు దోహదపడ్డాయి. దీని వెనుక మతపరమైన ఏకీకరణ (పోలరైజేషన్), ప్రభుత్వ వ్యతిరేకత, ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ వంటి హిందుత్వ సంస్థల చురుకైన పాత్ర వంటివి ఉన్నాయి. దీంతో ఒకప్పుడు కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌లకు మద్దతుగా నిలిచిన ఓటర్లు క్రమంగా బీజేపీవైపు మళ్లారు.బెంగాల్‌లో 27% పైగా ఉన్న ముస్లింలను బుజ్జగించేలా మమతా బెనర్జీ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. 2014 నుంచి బీజేపీ హిందూ నినాదాలు, పండుగలను ప్రాచుర్యంలోకి తీసుకురావడం ద్వారా పశ్చిమ బెంగాల్‌లోని హిందూ ఓటర్లను సమీకరించడానికి ప్రయత్నించింది. కానీ, హిందూ పూజారులకు భత్యాలు ఇవ్వడం, దుర్గా పూజల నిర్వహణకు నిధుల కేటాయింపు ద్వారా మమతా దీనిని విజయవంతంగా తిప్పికొట్టారు. 2021 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓడిపోయినప్పటికీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులను వెనక్కి నెట్టి పశ్చిమ బెంగాల్‌లో ఒక ప్రధాన శక్తిగా ఎదిగింది. తన ప్రధాన ఎజెండా అయిన హిందుత్వను బెంగాల్‌లో బీజేపీ బలంగా వినిపించింది. టీఎంసీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ హిందూ ఓటర్లను ఐక్యం చేయడంలో చాలా వరకు విజయం సాధించింది. జై శ్రీరామ్ నినాదం బీజేపీకి ఒక రాజకీయ నిరసనగా, గుర్తింపుగా మారింది. బెంగాల్‌లో సుదీర్ఘకాలం పాలించిన లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ బలహీనపడటంతో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని కమలం పార్టీ భర్తీ చేసింది. మమతా బెనర్జీని ఢీకొట్టే సత్తా ఉన్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేననే అభిప్రాయాన్ని ఓటర్లలో కలిగించడంలో సక్సెస్ అయ్యింది.నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల యోజన, ఆవాస్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాలు గ్రామీణ బెంగాల్‌పై గణనీయమైన ప్రభావం చూపాయి. ఈ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన పేర్లు పెట్టుకుంటోందనే ప్రచారాన్ని బీజేపీ విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది.మమతా బెనర్జీకి అండగా నిలిచే మహిళలను ఆకట్టుకోవడానికి బీజేపీ ఈసారి భారీ హామీలు ఇచ్చింది. గర్భిణీలకు రూ. 21,000 ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్సు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్, నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3,000 భృతి లాంటి హామీలు ఇచ్చింది.టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణం, సందేశ్‌ఖాలీ ఘటనలు, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఉదంతాలను రాజకీయ అస్త్రాలుగా బీజేపీ మలుచుకుంది. అధికార పార్టీ నేతల అవినీతి, మహిళల భద్రతను ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావించింది. రాజకీయ రణ రంగంగా మారుతున్న గ్రామీణ బెంగాల్‌లోకి ప్రవేశించడమే లక్ష్యంగా బీజేపీ అడుగులేసింది. క్షేత్ర స్థాయిలో మూలాలను పటిష్టం చేసుకోవడానికి బంకిం చంద్ర ఛటర్జీ, వివేకానంద వంటి ప్రముఖుల పేర్లను ఉపయోగించుకుంది. బెంగాల్‌లో బీజేపీ బలపడటానికి రామజన్మభూమి ఉద్యమం కూడా లబ్ది చేకూర్చింది. బంగ్లాదేశీ చొరబాటుపై ఆందోళనలను కూడా లేవనెత్తింది. దీంతో స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయిలో బీజేపీ రాజకీయ ప్రచారం 1991 లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపింది. ఆ ఎన్నికలలో సంస్థాగత నిర్మాణం లేకపోయినప్పటికీ, ఒక్క సీటు కూడా గెలవలేకపోయినప్పటికీ బీజేపీ బెంగాల్‌లో 11.7% ఓట్లను సాధించింది. తద్వారా పశ్చిమ బెంగాల్‌ ప్రజలు తమను ఆదరిస్తారనే నమ్మకం బీజేపీ నాయకత్వానికి కలిగింది.ఆ తర్వాత జరిగిన బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించింది. క్రమంగా స్థానిక రాజకీయాలలో తన ఉనికిని పెంచుకుంటూ వచ్చింది. బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లో లెఫ్ట్ ఫ్రంట్‌ స్థానాన్ని బీజేపీ క్రమంగా ఆక్రమించింది. వామపక్ష ప్రభుత్వ భూ సంస్కరణల వల్ల ప్రయోజనం పొందని గ్రామీణ ఓటర్లను సమీకరించడంలో బీజేపీ విజయం సాధించింది. 1997లో మమతా బెనర్జీ కాంగ్రెస్‌ను వీడి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ‌ను ప్రారంభించారు. ఆ సమయంలో మమతతో పొత్తు పెట్టుకోవడాన్ని బీజేపీ ఒక మంచి అవకాశంగా భావించింది. కాంగ్రెస్‌, వామపక్షాలను వ్యతిరేకించిన మమత సైతం అప్పట్లో బీజేపీని స్వాగతించారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీ కలిసి పోటీ చేయగా.. తొలిసారి బెంగాల్‌లో ఒక లోక్‌సభ స్థానాన్ని కమలం పార్టీ గెలుచుకుంది. ఈ మైత్రి 1999 లోక్‌సభ ఎన్నికలలోనూ కొనసాగడంతో బీజేపీ రెండు పార్లమెంట్ సీట్లను గెలిచుకుంది. అయితే, 2001లో పొత్తు విచ్ఛిన్నం కావడంతో 2004 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి బీజేపీ బెంగాల్‌లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కానీ, తన ఓటు బ్యాంకును పెంచుకుంటూ 2009లో ఒకటి, 2014లో రెండు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన బీజేపీ.. 2016లో మూడు ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచింది. చివరకు 2019లో 40 శాతం ఓట్లతో 18 లోక్‌సభ స్థానాలు, 2021 ఎన్నికల్లో 39 శాతం ఓట్లతో 77 అసెంబ్లీ స్థానాలు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.2021 ఎన్నికల ముందు టీఎంసీలోని కీలక నేతలను బీజేపీ తనవైపు తిప్పుకుంది. మమతా బెనర్జీకి కుడి భుజం లాంటి సువేందు అధికారి బీజేపీలో చేరారు. ఈయన నందిగ్రామ్‌లో దీదీని ఓడించి సంచలనం సృష్టించారు. టీఎంసీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ముకుల్ రాయ్ సైతం బీజేపీలో చేరారు. అయితే 2021 ఎన్నికల తర్వాత మళ్లీ ఈయన టీఎంసీ గూటికి చేరారు. టీఎంసీ అంటే గిట్టని వర్గాలను తమవైపు తిప్పుకోవడం, హిందూత్వ అజెండా, ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించడం, మోదీ–షా ద్వయం కారణంగా 2021 ఎన్నికల్లో బీజేపీ బెంగాల్‌లో దాదాపుగా గెలిచినంత పని చేసింది. కానీ మమతకు మహిళలు, ముస్లింలు అండగా నిలవడంతో కమలం పార్టీ అధికారంలోకి రాలేకపోయింది.