తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ముక్కోణపు పోటీ నెలకొంది. డీఎంకే, అన్నాడీఎంకేలకు విజయ్ పార్టీ టీవీకే తోడు కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. దీంతో తమిళనాడులో ఎవరు అధికారంలోకి వస్తారు? విజయ్ పార్టీకి ఎంత శాతం ఓట్లు, ఎన్ని సీట్లు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఐదేళ్ల క్రితం జరిగిన ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. ఆ ఎన్నికలు తమిళనాడుకు, అధినేత స్టాలిన్‌కు ఎందుకు ముఖ్యంగా మారాయనేది చూద్దాం..ఐదేళ్ల క్రితం జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలవడం, స్టాలిన్ సీఎం కావడం అందరికీ తెలిసిందే. అయితే అంతకు ముందు ఎన్నికల వరకు తమిళనాడు అనగానే అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, డీఎంకే చీఫ్ కరుణానిధి గుర్తుకొచ్చేవారు. జయలలిత 2016లో, కరుణానిధి 2018లో మరణించారు. దీంతో ఈ ఇద్దరు దిగ్గజాలు లేకుండా తొలిసారి జరిగిన ఎన్నికలుగా 2021 ఎన్నికలు గుర్తుండి పోతాయి.కరుణానిధి మరణం తర్వాత తొలిసారి జరిగిన ఈ ఎన్నికలు స్టాలిన్ నాయకత్వానికి అగ్ని పరీక్షలా మారాయి. ఇంత కాలంపాటు తండ్రి నీడలో ఉన్న స్టాలిన్ సొంతంగా పార్టీని అధికారంలోకి తీసుకురాగలరా? అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే 25 ఏళ్ల తర్వాత డీఎంకేకు సొంతంగా మెజార్టీ సాధించడం ద్వారా తన నాయకత్వంపై ఉన్న అనుమానాలను స్టాలిన్ పటాపంచలు చేశారు.2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు అన్నాడీఎంకే పదేళ్ల పాలనకు ముగింపు పలికాయి. డీఎంకే సారథ్యంలో సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ 159 సీట్లు సాధించగా.. 133 సీట్లు గెలిచిన డీఎంకే సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల మెజార్టీని సాధించింది. జయలలిత చనిపోయిన తర్వాత సీఎం పళనిస్వామి, మరో కీలక నేత పన్నీరుస్వామి ఇద్దరూ బీజేపీ చెప్పినట్లుగా నడుచుకున్నారనే భావన కారణంగా ఎన్నికల్లో అన్నాడీఎంకేపై వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో అన్నాడీఎంకే కూటమి 75 సీట్లకే పరిమితమైంది. అన్నాడీఎంకేలో బలమైన నేతలు లేకపోవడంతో (పళనిస్వామి, పన్నీరుసెల్వం ఉన్నప్పటికీ జయలలిత స్థాయి ప్రజాదరణ లేకపోవడం) వల్ల డీఎంకే గెలుపు సులువైంది. అందుకే 1996 తర్వాత తొలిసారి సొంతంగానే మెజార్టీ సాధించింది. దీంతో కరుణానిధి కుమారుడు స్టాలిన్ సీఎం అయ్యారు.మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. 2001 నుంచి తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ.. ఈ ఎన్నికల్లో ఎట్టకేలకు సఫలమైంది. అన్నాడీఎంకే సపోర్ట్‌తో కమలం పార్టీ తరఫున నలుగురు ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు స్పెషల్‌గా నిలవడానికి మరో ప్రధాన కారణం ఉంది. అదేంటంటే.. కరోనా వైరస్ విజృంభణ కారణంగా కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ.. ఎన్నో ప్రోటోకాల్స్ నడుమ అత్యంత జాగ్రత్తగా ఈ ఎన్నికలు జరిపారు. కరోనా భయం ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో 72.8 శాతం పోలింగ్ నమోదైంది. సీమన్ నాయకత్వంలోని నామ్ తమిళర్ కట్చి ఒంటరిగా పోటీ చేసి 6.6 శాతానికిపైగా ఓట్లు సాధించింది. కమల్ హాసన్‌కు చెందిన మక్కల్ నీధి నెయ్యమ్ (ఎంఎన్ఎం) 2.62 శాతం ఓట్లు సాధించింది. కమల్ హాసన్ పార్టీ 25 నియోజకవర్గాల్లో మూడో స్థానంలో నిలిచింది. చెన్నైలో ఎంఎన్ఎంకు 8.3 శాతం ఓట్లు పడ్డాయి. అయితే కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేసిన కమల్ హాసన్‌పై బీజేపీకి చెందిన వనతి శ్రీనివాసన్ 1728 ఓట్ల తేడాతో గెలిచారు.