తెలంగాణలోని అన్నదాతనలు రుణవిముక్తులను చేయడంతో పాటు, వారిని ఆర్థికంగా బలోపేతం చేయటమే రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా కూసుమంచిలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అక్షరాలా అమలు చేస్తోందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక రైతు డిక్లరేషన్‌ను ప్రకటించిన వరంగల్ సభాస్థలిలోనే.. ఈ నెల 5, 6, 7 తేదీల్లో భారీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. వేలాది మంది రైతులకు రాయితీపై ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో రైతులను విస్మరించిందని, కనీసం రాయితీపై పరికరాలు కూడా అందించలేదని ఆయన విమర్శించారు.రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షల మంది రైతులకు ఒకేసారి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసి రికార్డు సృష్టించామని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వం వరి సాగును నిరుత్సాహపరిస్తే.. తమ ప్రభుత్వం మద్దతు ధరతో పాటు సన్న ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తోందని చెప్పారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేలు సకాలంలో అందిస్తున్నామని, ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని వివరించారు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర ఉన్న భారాస నేడు కపట ప్రేమ వలకబోయడం హాస్యాస్పదమని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌కు బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ప్రక్రియను ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తామని ప్రజలకు తీపి కబురు అందించారు. నేటి నుంచి రైతు వారోత్సవాలు'ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక'లో భాగంగా నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. వికారాబాద్‌ జిల్లా తాండూరు వేదికగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించనున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతో పాటు, ఆధునిక సాంకేతికతను రైతులకు చేరువ చేయడమే ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఆరు రోజుల పాటు ప్రతి రోజును ఒక ప్రత్యేక విభాగానికి కేటాయించి, ఆయా రంగాల్లోని నిపుణుల ద్వారా రైతులకు అవగాహన కల్పించనున్నారు. మొదటి రోజు నేల ఆరోగ్యం, భూసార పరీక్షలు, ఎరువుల సమతుల్య వినియోగం, సహజ వ్యవసాయంపై రైతులకు దిశానిర్దేశం చేస్తారు. రెండో రోజు లాభదాయకమైన పంటల మార్పిడి పద్ధతులు, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిచ్చే సూక్ష్మ సేద్యంపై అవగాహన కల్పిస్తారు.మూడో రోజు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కేలా మార్కెట్ లింకేజీలు, ప్రభుత్వ రుణ సదుపాయాల గురించి వివరిస్తారు. నాలుగో రోజు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం, ఆధునిక యంత్ర పరికరాలు, సౌర శక్తి పరిష్కారాలపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఐదో రోజు పాడి పశువుల ఆరోగ్యం, మేత యాజమాన్యం, చేపల ఉత్పత్తి పెంపునకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇస్తారు. ఆరో రోజు వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు, నీటి వనరుల పొదుపు, నిర్వహణపై రైతులకు మార్గనిర్దేశనం చేస్తారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అలవర్చుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.