SBI Card Charges: మీరు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడుతుంటే కచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన అప్డేట్ మీకోసం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కార్డు తమ కార్డులకు సంబంధించిన లేట్ పేమెంట్ ఛార్జీలను సవరించింది. సవరించిన కొత్త ఛార్జీలను మే 1, 2026 నుంచే అమలులోకి తెచ్చింది. ఈ ఛార్జీలు ఇచ్చిన గడువులోపు మినిమం అమౌంట్ డ్యూ సైతం చెల్లించని వారికి వర్తిస్తాయని తెలిపింది. మరి ఎంత డ్యూ ఉంటే ఎంత ఛార్జీ పడుతుంది, పాత ఛార్జీలు కొత్త ఛార్జీలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మే 1 నుంచి అమలవుతోన్న కొత్త ఛార్జీలుపేమెంట్ బకాయిలు రూ.100 వరకు ఇప్పటి వరకు లేట్ పేమెంట్ ఛార్జీలు లేవు. ప్రస్తుతం సైతం ఎలాంటి ఛార్జీలు విధించడం లేదు. రూ.100 నుంచి రూ.500 వరకు బకాయిలు ఉండి కనీస పేమెంట్ సైతం చేయకపోయినా ఇప్పటి వరకు జీరో ఛార్జీలు ఉండగా ఇకపై రూ.100 మేర పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. రూ.500 నుంచి రూ.1000 వరకు బకాయిలు ఉంటే లేట్ పేమెంట్ ఛార్జీలను రూ.400 నుంచి రూ.500లకు పెంచారు. రూ.1000 నుంచి రూ.10 వేల వరకు ఛార్జీలను రూ.750 వద్ద స్థిరంగా ఉంచారు. రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు ఛార్జీలను సైతం రూ.950 వద్ద స్థిరంగా కొనసాగించారు. రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ఛార్జీలు రూ.1100, రూ.50 వేలు ఆపైన ఛార్జీలు ఉంటే రూ.1300 వరకు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. చెల్లించకపోతే అదనంగా రూ.100 పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. కనీస అమౌంట్ డ్యూ చెల్లించే వరకు ఈ రూ.100 చొప్పున పెనాల్టీ పడుతూనే ఉంటుంది. SBI కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ (SBICPSL) ప్రతి నెలా కార్డ్ హోల్డర్ డేటాను నిర్దేశిత ఫార్మాట్‌లో ఒక క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీకి సమర్పిస్తుంది. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ సమర్పించిన డేటాను 30 రోజులలోపు వారి సర్వర్‌లో అప్‌లోడ్ చేస్తుంది. ప్రాథమిక కార్డ్ హోల్డర్ దివాలా తీసినా లేదా మరణించినా, మొత్తం బకాయితో పాటు, కార్డ్ ఖాతాకు ఇంకా ఛార్జ్ చేయని ఛార్జీల మొత్తాన్ని కూడా SBICPSLకు తక్షణమే పూర్తిగా చెల్లించవలసి ఉంటుందని, కార్డ్ ఖాతా తక్షణమే రద్దు చేయనున్నట్లు SBI కార్డ్ వెబ్‌సైట్ పేర్కొంది.